రాహుల్ ముందే ఒకసారి ఆలోచించాలి

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో పాటు ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌(స‌ర్‌) ప్ర‌క్రియ‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిచేయాల‌ని లేదా ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్ట‌నున్న నిర‌స‌న తీవ్ర వివాదానికి దారితీసింది. న‌వంబ‌రు 1న ఢిల్లీలోని రాం లీలా మైదాన్‌లో ఈ భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ తెర‌దీసింది. దీనికి ఇత‌ర ప్ర‌తి ప‌క్షాలు కూడా జ‌త‌క‌లిశాయి. అంతేకాదు.. ఇత‌ర ప్ర‌జా సంఘాలు కూడా దీనికి జైకొట్టాయి. అయితే.. ఈ వ్య‌వ‌హారం.. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌కు.. వ్యాపార వ‌ర్గాల‌కు మ‌ధ్య వివాదంగా మారింది.

ఎందుకు?

న‌వంబ‌రు 1న నిర‌స‌న చేప‌డితే త‌మ‌కు నష్టం వాటిల్లుతుంద‌ని వ్యాపార వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై గ‌త వారం నుంచి కూడా వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చే నెల 8న దీపావ‌ళి వుంద‌ని.. దాని త‌ర్వాత‌.. భాయ్ దూజ్‌ పేరుతో ఉత్త‌రాది వారు నిర్వ‌హించుకునే మ‌రో వేడుక కూడా ఉంద‌ని వారు చెబుతున్నారు. ఇక‌, వీటికి ముందు ధ‌న్‌తేర‌స్ కూడా కొన‌సాగుతుంద‌న్నారు. ఫ‌లితంగా ఒక్క దేశ రాజ‌ధానిలోనే 25 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు వ్యాపారాలు జ‌రుగుతాయ‌ని అన్నారు. కానీ.. కాంగ్రెస్ చేప‌డుతున్న నిర‌స‌న‌ల కార‌ణంగా.. ఈ వ్యాపారాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని.. కాబ‌ట్టి న‌వంబ‌రు 10వ‌తేదీ త‌ర్వాత‌కు వాయిదా వేసుకోవాల‌ని వ్యాపారులు కోరుతున్నారు.

దీనిపై తాజాగా రాహుల్‌గాంధీ స్పందించారు. మీరంటే మాకు అభిమానం ప్రేమ ఉన్నాయి. మీ మాట వింటాం అంటూ.. వ్యాపార వ‌ర్గాల‌ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే.. ఓట్ చోరీకి పాల్ప‌డుతూ.. దేశంలో కోట్ల మంది ఓట్ల‌ను దొంగ‌తనంగా తీసేస్తున్న ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాల‌ని ప్ర‌ధాని మోడీకి మీరు కూడా విజ్ఞ‌ప్తి చేయండి. ఆ వెంట‌నే అర నిమిషంలో మేం వెన‌క్కు త‌గ్గుతాం. మా నిర‌స‌న‌ల్నీ.. ఆపేస్తాం.. అని రాహుల్ పేర్కొన్నారు. అయితే.. వ్యాపార వ‌ర్గాలు ఈ విష‌యంపై భిన్న‌వాద‌న వినిపించాయి. ఆ వ్య‌వ‌హారం రాజ‌కీయాల‌తో కూడుకున్న‌ద‌ని.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. తాము వ్యాపార కోణంలోను, ప్ర‌జ‌ల కోణంలోనే కోరుతున్నామ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే..

ఇక‌, దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని వ్యాపారులు చేస్తున్న విజ్ఞ‌ప్తిపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ స‌హా.. ఆమ్ ఆద్మీపార్టీలు సానుకూలంగా స్పందించాయి. తాము చేప‌డుతున్న నిర‌స‌న‌ల‌ను న‌వంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ విష‌యంలో మ‌రింత పుంజుకునేందుకు.. నిర‌స‌న‌ల‌ను పూర్తిగా త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. వ్యాపార వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న ద‌రిమిలా.. రాహుల్ కేంద్రంగా నెటిజ‌న్లు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా రు. మ‌రోవైపు వ్యాపారులు కోర్టుకు వెళ్ల‌గా.. అక్క‌డ వారికి ఊర‌ట ల‌భించ‌లేదు. నిర‌స‌న‌లు ప్ర‌జాస్వామ్య హ‌క్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది.