వైసీపీ తరఫున ముద్రగడ కుటుంబానికి దక్కుతున్న ఆదరణ ఎంత? పద్మనాభం మృతి చెందిన తర్వాత.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన వైసీపీ నేతలు. ఆ తర్వాత ఆయనను మరిచిపోయినట్టు వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీ నుంచి మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేస్తే బాగుంటుందని కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు జగన్కు సూచించారని.. దీనిపై చర్చించారని వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ముద్రగడకు ఉన్న గుర్తింపు నేపథ్యంలో వైసీపీ ఆ కుటుంబానికి అండగా నిలిస్తే .. వచ్చే ఎన్నికల నాటికి కాపు ఓటు బ్యాంకు పదిలంగా వైసీపీకి పడుతుందన్న ఆలోచనను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబం నుంచి ఆయన చిన్న కుమారుడు గిరి వైసీపీలో ఉన్నారు. ఆయన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన స్థానిక ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలపైనే దృష్టి పెట్టారు.
కానీ, ప్రస్తుతం ముద్రగడ మరణం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన సానుభూతి వంటివి దక్కించుకునేందుకు ముద్రగడ సతీమణి పద్మావతికి స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే లు కొందరు సూచించారు. దీనికి తొలుత జగన్ కూడా తలూపారని అంటున్నారు. ముద్రగడ కుటుంబం నుంచి గిరి రాజకీయాల్లోకి వచ్చినా.. తండ్రి అంత స్థాయిలో ఆయన హవా ప్రదర్శించలేక పోతున్నారన్నది వాస్తవం. అందుకే.. ఆ లోటును భర్తీ చేసేందుకు పద్మావతిని బరిలోకి తీసుకురావాలని అనుకున్నారు.
ఏం జరిగింది..?
ముద్రగడ కుటుంబం నుంచి మరోనేతకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను వైసీపీలోనే ఓ కీలక నాయకుడు అడ్డుకున్నట్టు తెలిసింది. ఒకేఫ్యామిలీ నుంచి ఇంత మందికి అవకాశం ఇవ్వడం సరికాదన్న ఆయన సూచనతో పద్మావతి విషయాన్ని పక్కన పెట్టారని అంటున్నారు. అయితే.. సహజంగానే పద్మావతి కూడా ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. కానీ, రాకూడదని ఏమీ లేదు. ఇప్పుడు సరైన సమయమని కూడా అంటున్నారు. కానీ, ఓ కీలక నాయకుడు చక్రం తిప్పడంతో ముద్రగడ కుటుంబం విషయాన్ని జగన్ పక్కన పెట్టారని అంటున్నారు. ఈ వ్యవహారం కాపు నాయకుల్లో చర్చకు దారితీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates