స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారిని నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ.. గగ్గోలు పెట్టిన వైసీపీ అధినేత జగన్‌కు.. షాక్ అయ్యేలా ఆంగ్ల పత్రికలు కొన్ని కథనాలను ప్రచురించాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఒక్క సీమలోని జగన్ సొంత జిల్లా కడపలోనే అల్లర్లు జరిగాయి తప్ప.. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా అల్లర్లు కాదుకదా.. కనీసం ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కూడా రాలేదని స్పష్టం చేశాయి.
అంతేకాదు.. మొత్తం స్థానాల్లో అధికార టీడీపీ కూటమి నాయకులు 8774 నామిషన్లు వేయగా.. ఒక్క వైసీపీనే.. 8128 నామినేషన్లు దాఖలు చేసింది. అంటే.. వీటి మధ్య తేడా కేవలం 600. నిజానికి ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు వేసే పరిస్థితి ప్రతిపక్షానికి ఉందంటే.. అది శాంతియుతంగా జరిగినట్టే కదా? అని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నిజానికి ఆదివారం ఉదయం నుంచి జగన్ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున హడావుడి సృష్టించారు. తమవారిని అడ్డుకుంటున్నారని ఆయన గగ్గోలు పెట్టారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠాపైనా నోరు చేసుకున్నారు. తిరిగి ఆయన వద్దకే వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక, సాయంత్రం గవర్నర్‌ను కలుసుకుని ఆయనకు కూడా ఫిర్యాదులు చేశారు. మరోవైపు అసలు నామినేషన్ ప్రక్రియనే ఆపుచేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇలా.. అన్ని ప్రయాత్నాలు ఆదివారమే చేశారు. ఇంత చేసిందీ.. తమ వారితో నామినేషన్లు వేయకుండా అడ్డుకుని అన్యాయం చేస్తున్నారనే!. కానీ, వాస్తవానికి తాజాగా వెల్లడైన సంఖ్యను బట్టి టీడీపీ 8774 నామినేషన్లు వేస్తే.. వైసీపీ 8128 నామినేషన్లు వేసింది. మరి అన్యాయం ఎక్కడ జరిగిందన్నది జగనే చెప్పాలని లోకేష్ ప్రశ్నిస్తున్నారు.
మరీ ముఖ్యంగా రాజకీయంగా ఉద్రిక్తంగా ఉండే విజయవాడలోనూ నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగిపోయిందని ఆధారాలతో సహా లోకేష్ వివరించారు. విజయవాడలోని 69 వార్డులకు 242 మంది అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇక, మేయర్ పదవికి నలుగురు అభ్యర్థులు దాఖలు చేశారని, వీరిలో వైసీపీ నాయకురాలు కూడా ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు. అరాచకాలు సృష్టిస్తే.. ఇలా నామినేషన్ వేసేవారా? అని నిలదీశారు. జగన్ మీడియా ముందు తన ఏడుపును కట్టిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. రికార్డు స్థౄయిలో 22, 800 నామినేషన్లు(రాష్ట్రంలో అన్ని పార్టీలు) దాఖలయ్యాయి. ఏదైనా ఉంటే ప్రజలతోనే తేల్చుకోవాలి. అని పోస్టు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates