ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎంతో మంది వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఈ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా ఉండబోతోంది. ఇక, వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసే బంధువుల మధ్య పోటీ ఇంకా రసవత్తరంగా మారనుంది. చాలా చోట్ల చుట్టరికాన్ని చుట్ట చుట్టేసి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ అభ్యర్థులు కొందరు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆ కోవలోనే కర్నూలు మేయర్ ఎన్నికల బరిలో అత్తా కోడళ్లు.. నువ్వా నేనా అంటూ పోటీలో నిలిచిన వైనం ఆసక్తికరంగా మారింది.
కర్నూలు మేయర్ పీఠం కోసం టీడీపీ తరఫున టీడీపీ సీనియర్ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ పెద్ద కుమార్తె బొల్లెద్దుల విజయ ప్రత్యూష బరిలో నిలిచారు. అయితే, ఆమె సోదరి అత్తయ్య అయిన సుశీల వైసీపీ తరఫున ప్రత్యూషపై పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ సతీమణి అయిన సుశీల కుమారుడిని ప్రత్యూష చెల్లెలు వివాహం చేసుకున్నారు. దీంతో, అత్తాకోడళ్ల మధ్య జరగబోయే ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఆసక్తి ఏర్పడింది.
రామకృష్ణ కుటుంబం ఎన్నో ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతోంది. మంత్రి టీజీ భరత్కు ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. పార్టీకి విధేయులుగా ఉన్న రామకృష్ణ కుటుంబానికి మంత్రి భరత్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. కర్నూలు మేయర్ టికెట్ కోసం చాలామంది ఆశావహులు ఎన్నో ప్రయత్నాలు చేసినా విజయ ప్రత్యూష వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. కర్నూలులో 52వ వార్డు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉన్న ప్రత్యూష మేయర్ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates