మాజీ మంత్రి జోగి రమేష్ కు సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలేలా వుంది. కొడుకు రాజీవ్ వివాహం విషయంలో ఏర్పడ్డ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. అదే ఆయనకు రాజకీయ సమాధిగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొన్న ఆయన ఇంటిగుట్టు బయట పడకుండా మేనేజ్ చేసుకోలేక పోయారని సన్నిహితులు సైతం చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా జోగి రమేష్ వ్యవహారం పట్ల సీరియస్ గా వున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీకి తలవొంపులు తీసుకొచ్చిన ఈ ఘటన నుంచి బయట పడేందుకు జోగి రమేష్ పై వేటు వేయడం ఒక్కటే పరిష్కారంగా జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు తెలంగాణా రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యాపారవేత్త అనంత కృష్ణ గౌడ్ కూతురు మేఘనతో 2025 మే 28 న వివాహం జరిగింది. సంపన్నుడైన అనంత కృష్ణ గౌడ్ కూతురి పెళ్ళికి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. కట్నకానుకల కింద 1.5 కిలోల బంగారం, 10 కేజీల వెండి ఇచ్చినట్లు మేఘన మీడియాకు వెల్లడించడం తెలిసిందే. ఏమి జరిగిందో ఏమో కానీ రెండు నెలలకే ఈ పెళ్లి పెటాకుల దాకా వచ్చింది. జోగి కుటుంబం విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. దంపతుల మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసి విఫలం కావడంతో చట్ట ప్రకారం కోర్టుకు వెళ్లినట్లు జోగి కుటుంబం చెబుతుంది. టీడీపీ నాయకులు తన కుటుంబం పరువు తీసేందుకు తెర వెనక కుట్రలు చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు.
మేఘన మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. పెళ్ళికి ముందే రాజీవ్ కు శారీరక సమస్యలు ఉన్నాయని, దాన్ని దాచిపెట్టి వివాహం చేసి తన గొంతు కోశారని మేఘన చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ వార్తగా మారింది. అదనపు కట్నం కోసం వేధించడం, మతం విషయంలో అబద్దాలు చెప్పడం వంటి ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను జోగి రమేష్ మీడియా సమావేశం పెట్టి ఖండించడం, మేఘన కౌంటర్ ఇవ్వడంతో జరగాల్సినంత రచ్చ జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి సమస్య వైసీపీ తలకు చుట్టుకుంది.
జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రోజురోజుకు సద్దుమణగక పోవడంతో వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కుటుంబ సమస్య పార్టీ పరువు తీస్తుందని ఆయన ఆగ్రహంగా వున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇది ఇప్పట్లో తేలే సమస్య కాదు కనుక జోగి రమేష్ ను పార్టీ నుంచి బయటకు పంపించి చేతులు కడుక్కోవాలని అధిష్టానం భావిస్తుందని కృష్ణా జిల్లా వైసీపీలో ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే జోగి రాజకీయంగా సమాధి అయినట్లే అని చెప్పొచ్చు.
ఇప్పటికే ఆయన మీద నకిలీ మద్యం కేసు వుంది. ఈ కేసులో కొన్నాళ్ళు జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. ఇప్పుడు కోడలు పెట్టిన కుంపటితో లాక్కోలేక పీక్కోలేక పోతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీ తలుపులు ఎప్పుడో మూసేసింది మిగిలింది వైసీపీ ఒక్కటే . ఇక్కడ కూడా గెంటేస్తే.. మున్ముందు ఏమి చేస్తాడో చూడాలి.
This post was last modified on August 27, 2026 2:25 pm
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…