కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ముద్రగడ… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా కొనసాగారు. అనారోగ్యంతో ముద్రగడ మరణించారు గానీ… ఇంకొంతకాలం ఆయన బతికి ఉంటే గవర్నర్ పదవిని కూడా చేపట్టేవారే. నిజమా? అంటే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారట. కాపు ఉద్యమాలతోనే సహజీవనం చేసిన ముద్రగడకు గవర్నర్ పదవి వచ్చి ఉంటే నిజంగానే… ఆ సామాజిక వర్గానికి ఓ గుర్తింపు దక్కేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా ముద్రగడ వైసీపీలో చేరిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాస్తంత విశ్రాంతి తీసుకున్న ముద్రగడ అప్పటిదాకా ఏ పార్టీ పక్షమూ వహించని సంగతి తెలిసిదే. అయినా కూడా ఆయన కాపు ఉద్యమమే నేపథ్యంగా సాగారు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్… ముద్రగడకు గవర్నర్ పదవిని ఇచ్చే విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో జనసేన జట్టు కట్టిన కూటమి ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని చెప్పిన పవన్… ఆ తర్వాత ముద్రగడకు గవర్నర్ పదవిని ఇద్దామంటూ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు.
కృష్ణా జిల్లా కైకలూరులో జనసేన చర్చావేదిక పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పార్టీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలు, వాటి పరిష్కారంపై దృష్టి సారించేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా నాదెండ్ల… ముద్రగడ అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీలతో జనసేన జట్టు కట్టి కూటమిగా ఏర్పడిన నాటి సంగతులను ఈ సందర్భంగా నాదెండ్ల ప్రస్తావించారు. అప్పటికి ముద్రగడ ఇంకా వైసీపీలో చేరలేదు. జనసేన తరఫున ఆయా కీలక నేతలతో చర్చలు జరపాలని, వారందరి సహకారంతోనే ఎన్నికలకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్దేశించుకున్నట్లుగా నాదెండ్ల చెప్పుకొచ్చారు.
అందులో భాగంగానే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభంతోనూ చర్చలు జరపాలని పవన్ తీర్మానం చేశారని నాదెండ్ల తెలిపారు. జనసేన సిద్ధాంతాలతో ముద్రగడ కూడా కలిసి వస్తారన్న ఆశాభావాన్ని నాడు పవన్ వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని, ఆ తర్వాత ముద్రగడకు జనసేన తరఫున గవర్నర్ పదవిని ఆఫర్ చేద్దామని పవన్ అన్నారని తెలిపారు. ముద్రగడ మరణం నేపథ్యంలో ఆయనను, రాజకీయాల్లో ఆయన ప్రస్థానం, కాపు ఉద్యమంలో ఆయన నెరపిన వ్యూహాలను గుర్తు చేసుకున్న సందర్భంగా నాదెండ్ల ఈ మాటలను మరోమారు గుర్తు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates