పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల కంటే ముందు సినిమా నటుడిగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్… తెలుగు నేలలో అశేష అభిమాన సమూహాన్ని సంపాదించుకున్నారు. అభిమానుల పట్ల పవన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఆయనకు ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో పోగయ్యారని చెప్పాలి. అభిమానుల పట్ల పవన్ ఏ వేగంతో స్పందిస్తారన్న విషయం తాజాగా మరోమారు రుజువైంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారి అభిమాని నిరంజన్ అడిగిన కోరికలను కేవలం గంట వ్యవధిలోనే తీర్చేసిన పవన్… తన ప్రత్యేకతను చాటుకున్నారు.

తెలంగాణలోని హన్మకొండకు చెందిన నిరంజన్ జన్యు ఆధారిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకు పవన్ ను కలవాలనుందన్న నిరంజన్ మాటను తెలుసుకున్న పవన్… అతడి కోరికను తీర్చేందుకు నేరుగా అతడి ఇంటికే వెళ్లారు. ఈ సందర్భంగా నిరంజన్ తో అత్యంత ఆప్యాయంగా మెలగిన పవన్…నిరంజన్ ముఖంలో చిరు నవ్వులు చిందేలా వ్యవహరించారు. నిరంజన్ ను ఓ కుటుంబ సభ్యుడిలా పరిగణించిన పవన్… అతడి కోరికలను కూడా తెలుసుకుని మరీ వాటిని అక్కడికక్కడే తీర్చేశారు.

పవన్ తన ఎదుట ప్రత్యక్షం కాగానే నిరంజన్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక పవన్ తన మంచంపై కూర్చున్న వైనం చూశాక పవన్ తో తన మనసు విప్పి మరీ మాట్లాడారు. ఈ క్రమంలోనే మంచానికే పరిమితమైన తనకు ఓ కుక్కను పెంచుకోవాలని ఉందని నిరంజన్ తెలిపారు. అంతేకాకుండా ఓ ట్యాబ్ ఉంటే కూడా తనకు ఒకింత కాలక్షేపం అవుతుందని కేూడా అతడు చెప్పాడు. ఈ విషయాలను విన్న పవన్ వాటిని అక్కడికక్కడే తీర్చే దిశగా వేగంగా చర్యలు చేపట్టారు.

నిరంజన్ కోరిక మేరకు అతడికి ఓ ట్యాబ్ ను కేవలం గంట వ్యవధిలో అందేలా పవన్ చూశారు. పవన్ ఆదేశాలతో జనసేన నేతలు నిరంజన్ కు ట్యాబ్ ను అందజేశారు. అంతేకాకుండా నిరంజన్ ఉంటున్న ఇంటిలో కుక్కను పెంచుకునే అవకాశం లేదన్న విషయాన్ని తెలుసుకున్న పవన్… అక్కడికక్కడే ఆ గృహ సముదాయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని పిలిచి మాట్లాడారు. నిరంజన్ కోరికను ఆ వ్యక్తికి చెప్పడంతో పాటుగా నిరంజన్ ఇంటిలో పెంపుడు కుక్కను అనుమతించేలా ఆయనను ఒప్పించారు. స్వయంగా పవనే కోరడంతో నిరంజన్ ఇంటిలో పెంపుడు కుక్క ఉండేందుకు ఆ వ్యక్తి సంతోషంగానే అంగీకరించారు.

ఇక నిరంజన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన పవన్… తన బృందం ద్వారా ఓ కుక్క పిల్లను నిరంజన్ ఇంటికి పంపారు. ఈ కుక్క పిల్లను చూసి నిరంజన్ కేరింతలు కొట్టాడు. పవన్ ప్రేమగా పంపిన ఆ కుక్క పిల్లకు అతడు రెక్స్ అని పేరు పెట్టుకున్నారు. తన అభిమాన నటుడు తాను కోరిన మేరకు కుక్కతో పాటు ట్యాబ్ ను పంపిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ నిరంజన్ సంబరంలో మునిగిపోయాడు. ఇక పవన్ పంపిన కుక్కతో ఆడుకుంటూ… పవన్ పంపిన ట్యాబ్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నిరంజన్ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.