జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ పట్టణానికి వెళ్లిన పవన్… ఆ పట్టణానికి చెందిన తన వీరాభిమాని అయిన ఓ చిన్నారిని పరామర్శించారు. కేవలం తనను చూడాలని ఉందన్న తన అబిమాని చివరి కోరికను తీర్చేందుకే పవన్ హన్మకొండ వెళ్లారు. ఈ సందర్భంగా తాను కనిపించి తన అభిమానికి ఆయన మరపురాని అనుభూతిని కలిగించారు. అంతేకాకుండా తన హిట్ సినిమా గబ్బర్ సింగ్ చిత్రంలో తాను పోషించిన గబ్బర్ సింగ్ పేరే తన అభిమానికి ఉందన్న విషయాన్ని తెలుసుకున్న పవన్ కదిలిపోయారు.
జన్యుపరమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పవన్ అభిమాని నిరంజన్… శరీర ఎదుగుదల లేకుండా మంచానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన అభిమాన నటుడు అయిన పవన్ ను చూడాలని ఉందని అతడు ఇటీవలే తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ విషయాన్ని జనసేనకు చెందిన నేతలు పవన్ కు చేరవేశారు. గడచిన రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. ఢిల్లీ పర్యటన ముగించుకున్న వెంటనే నిరంజన్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరిన పవన్.. బుధవారం ఉదయమే నేరుగా హన్మకొండ చేరుకున్నారు. పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఉంటున్న నిరంజన్ ఇంటికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను వచ్చానని నిరంజన్ కు తెలియజేసిన పవన్.. కదలలేని అతడి స్థితిని గమనించి అతడి మంచంపైనే కూర్చున్నారు.
ఈ సందర్భంగా నిరంజన్ ను తాకిన పవన్… అతడిని అనునయించారు. అతడితో సెల్ఫీ దిగారు. నీ కోరిక తీర్చేందుకే తాను ఇంతదూరం వచ్చానని అతడితో పవన్ చెప్పారు. తాను కోరుకున్నట్లుగా నేరుగా పవనే తన వద్దకు రావడంతో నిరంజన్ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగానే అందరూ తనను చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని అతడు పవన్ కు చెప్పారు.
ఈ సందర్భంగా నిరంజన్ తల్లిదండ్రులతో పవన్ మాట్లాడారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష నగదును ఆయన వారికి అందించారు. అనంతరం నిరంజన్ కు అందుతున్న వైద్య చికిత్సల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.
పనిలో పనిగా నిరంజన్ కుటుంబ జీవనోపాది గురించి ఆరా తీసిన పవన్.. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాది కింద ఓ క్యాంటీన్ పెట్టించాలని జనసేన నేతలకు ఆయన సూచించారు. అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆయన నిరంజన్ కు, అతడి కుటుంబ సభ్యులకు అందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates