టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ కలిసి ఉండే విషయంలోనూ ఆయన తన మనసులోని మాటను వెల్లడించేశారు. ఇక్కడ ఎవరి పేర్లూ ఆయన చెప్పలేదు. ఎవరినీ ఆయన ప్రశ్నించలేదు. అంతేకాదు.. ఇది ఫలానా ఘటన అందుకే ఇలా చెబుతున్నా అని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను అన్నింటినీ గుది గుచ్చి.. ఒకేసారి అందరికీ.. ఒకే వేదికపై పెట్టాల్సిన పెట్టేశారు!. నేను పవన్.. కలిసే ఉంటాం. ఇక మీ ఇష్టం అని తేల్చేశారు.
ఏం జరిగింది?
ఇటీవల కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడుతున్నాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు సాగుతున్నాయి. విమర్శలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జనసేన నాయకులతో టీడీపీ నేతలు వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో మీడియాకు లీకులు ఇస్తూ.. కూటమిపై కామెంట్లు వెలుగు చూసేలా చేస్తున్నారు. ఇలా.. అనేక సమస్యలకు టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు, అసంతృప్త నేతలే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కూటమిలో సఖ్యతపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.
ఈ పరిణామాలను ఉదహరిస్తూ.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కార్యకర్తలను ముందుండి నడిపించాల్సిన సీనియర్లపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారం వచ్చిందన్న అహంతో ఎవరూ మెలగవద్దని అన్నారు.
ఇది కూటమి ప్రభుత్వమని.. కూటమిగా వెళ్లి.. కూటమిగానే ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో సీనియర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. అందరూ కలసి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కుతుందన్నారు. నేను -పవన్ బాగానే ఉన్నాం. ఇక, మీరే తేల్చుకోండి. అని చెప్పడం ద్వారా క్షేత్రస్థాయిలో సఖ్యతపై ఆయన కుండబద్దలు కొట్టారు.
క్రమశిక్షణే ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తనను వ్యక్తిగతంగా కూడా బాధించాయన్నారు. మనం సుపరిపాలన అనే యజ్ఞం చేస్తున్నాం. కానీ, మన నేతలే సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతోంది. అని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులు ఇలానే వ్యవహరించి ప్రజలకు దూరమయ్యారని అన్నారు. ఇప్పుడు మనం కూడా అలానే వ్యవహరిస్తామంటే.. ఊరుకునేది లేదని చెప్పారు. పవన్ కల్యాణ్‌తో కలిసి తాను సంతోషంగా ముందుకు సాగుతున్నానని చెప్పడం ద్వారా కూటమి ఆవశ్యకతను.. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య కలివిడిని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates