అసలు ఆస్తులే పంచలేదంటున్న విజయమ్మ… 

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు.

వైఎస్ విజయమ్మ స్పష్టంచేసిన ప్రకారం., 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు కుటుంబ ఆస్తుల పంపకం అసలు జరగలేదని తెలిపారు. ఆ కాలం వరకు ఉన్న ఆస్తులన్నీ సంయుక్త కుటుంబ ఆస్తులేనని పేర్కొన్నారు. ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని, అదే ఆయన ఆదేశమని వెల్లడించారు.

ఇటీవల ప్రచారంలో ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నోటరీ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.

అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వై.ఎస్. షర్మిల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు న్యాయంగా షర్మిలకు చెందాల్సినవేనని పేర్కొన్నారు. జగన్ స్వయంగా ఆ ఒప్పందాన్ని రాశారని, అందులో తనకు తక్కువే వాటా ఉన్నప్పటికీ అంగీకరించారని తెలిపారు.

ఇంకా, సరస్వతి సిమెంట్ వంటి ఆస్తులతో పాటు ఎం ఓ యులో ప్రస్తావించని యెలహంక భూమి కూడా షర్మిలకు చెందాల్సిందేనని విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పటివరకు తన మనుమలు, మనుమరాళ్లకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు

“ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చెప్పబడుతున్న వాటాలు పంపకం కిందకు రావు. నిజం ఏమిటో దేవుడికీ, నా కొడుకుకీ తెలుసు” అని విజయమ్మ వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆమె మీడియా మరియు సంబంధిత వ్యక్తులను వేడుకున్నారు.

ఈ ప్రకటనతో కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరింత కీలక దశకు చేరుకుంది. భవిష్యత్తులో ఈ అంశం ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.