బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి.. అంతకుమించి మాటల మాంత్రీకుడు.. తన్నీరు హరీష్ రావు గురించి చెప్పడానికి ఇవి చాలు. అంతేకాదు.. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆయన పోటీ చేసిన ప్రతి సారీ విజయమే అందుకున్నారు.. తప్ప.. పరాజయం అన్నమాటే లేదు. అలాంటి నాయకుడి ఇలాకాలో పోటీ చేసేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత సిద్ధమవుతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. పైకి ఆమె బోధన్, సిద్దిపేట అని రెండు ఆప్షన్లు చెప్పినా.. ఆమె ప్రత్యామ్నాయం ఏంటనేది అందరికీ తెలిసిందే. హరీష్‌రావుపై గత కొంతకాలంగా ‘గుంట నక్క’ అంటూ.. విరుచుకుపడుతున్న కవిత.. బీఆర్ఎస్ పార్టీలో విధ్వంసం చెలరేగడానికి ఆయనను కారకుడిగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పదే పదే టార్గెట్ కూడా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సిద్దిపేట నుంచి కవిత పోటీ చేయడం ఖాయం. అయితే.. ఈ నియోజకవర్గం అంటే అంత ఆషామాషీకాదు.. హరీష్ రావు పేరు చెబితే చాలు ఓట్లు రాలే నియోజకవర్గం. అలాంటి చోట కవిత.. తన అరంగేట్రంలోనే పోటీ చేస్తానని చెప్పడంపై అంత ఈజీకాదని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. గతంలో తన సొంత నియోజకవర్గంగా చెప్పుకొన్న నిజామాబాద్‌లోనే కవిత పల్టీ కొట్టారు. పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత.. ఎమ్మెల్యే గా పోటీ చేసిన చోటా పరాజయం పాలయ్యారు. కానీ, హరీష్‌రావు అలా కాదే. 2023లో బీఆర్ఎస్‌కు తీవ్ర వ్యతిరేక గాలులు వీచినప్పుడు కూడా ఆయన విజయం దక్కించుకున్నారు. ఇప్పటికీ ఆయన పేరుకు వాల్యూ ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయన తట్టుకుని నియోజకవర్గాన్ని కాపాడుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో కవిత ఏమేరకు పోరాటం చేస్తారు? ఏమేరకు నెగ్గుతారు? అనేది ప్రశ్న. అయితే గియితే.. హరీష్‌రావుపై ఉన్న అక్కసును మరింత ప్రదర్శించేందుకు పోటీ అనేది ఒక తురుపు ముక్క మాత్రమే అవుతుందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates