అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర‌సింగ్ , సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా ఈఘ‌ట్టం అద్భుతంగా సాగేలా అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే చారిత్రక ఘట్టంగా ప్ర‌భుత్వం దీనిని అభివ‌ర్ణించింది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శ‌నివారం శ్రీకారం చుట్ట‌నున్నారు.

దీని ద్వారా దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని ఏపీకి ద‌క్కిన‌ట్టు అయింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు దీనికి భూమి పూజ చేయ‌నున్నారు.

రాజ‌ధానిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ‘క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. శ‌నివారం మధ్యాహ్నం 4 గంటల స‌మ‌యంలో ఈ కేంద్రానికి భూమిపూజ చేయ‌నున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుందని ప్ర‌భుత్వం తెలిపింది.

దేశంలోనే ఫ‌స్ట్‌!

దేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టిన విష‌యం తెలిసిందే.

క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టం విస్తరణ, లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ల‌భించ‌నున్నాయి. క్వాంటమ్ సాంకేతిక‌త‌తో ఔష‌ధ‌ రంగంలో పరిశోధనలు వేగవంతం అవుతాయి. వ్యాధుల నిర్ధారణ మెరుగుపడనుంది. వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు కచ్చితత్వంతో ఉండడం, బ్యాంకింగ్-డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం వంటి అనేక ప్రయోజనాలు ప్ర‌జ‌ల‌కు అంద‌నున్నాయి.