Political News

వైసీపీ పలాయనం.. 3 చోట్ల కూటమి జెండా

ఏపీలో వేగంగా రాజకీయం మారుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విక్టరీతో కూటమి అధికారంలోకి రావడం… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి వైసీపీ పడిపోవడమే ఇందుకు దోహదం చేసిందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానిక సంస్థలను వైసీపీ గెలుచుకుంది. అధికార బలంతో వైసీపీ పరం అయిపోయిన ఈ స్థానాలన్ని ఇప్పుడు వరుసబెట్టి కూటమి ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఒకే రోజున రాష్ట్రంలోని మూడు కీలక పురపాలికల్లో కూటమి జెండా రెపరెపలాడింది. విశాఖ గ్రేటర్ మునిసిపల్ కార్పిరేషన్, గుంటూరు నగర పాలక సంస్థ, కుప్పం మునిసిపాలిటీల్లో కూటమి అధికార పక్షంగా మారిపోయింది.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మునిసిపాలిటీలో నిన్నటిదాకా వైసీపీ అధికార పక్షంగా ఉండగా… సోమవారం జరిగిన పరిణామాల్లో టీడీపీకి చెందిన సెల్వం మునిసిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీని వీడిన కొందరు కౌన్సిలర్లతో పాటుగా టీడీపీ ఎమ్మెల్సీ ఓటుతో కలుపుకుని మొత్తం 14 ఓట్లతో సెల్వం చైర్మన్ గా ఎన్నికయ్యారు.

వైసీపీ జమానాలో కుప్పంలో టీడీపీని జీరో చేస్తామంటూ సంచలన ప్రకటనలు చేసిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కుప్పం పురపాలికను కండబలంతో గెలిచేసుకున్నారు. అయితే ఆ గెలుపు ఎంతో కాలం నిలవలేదు. కూటమి అధికారంలోకి రాగానే.. వైసీపీ బెదిరింపులతో ఆ పార్టీ పంచన చేరిన కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా తిరిగి తమ సొంత గూడు టీడీపీలోకి చేరిపోయారు. ఫలితంగా కుప్పంలో వైసీపీ తన హవాను కోల్పోగా.. తాజాగా మునిసిపల్ చైర్మన్ పోస్టును కూడా కోల్పోయింది.

ఇక విశాఖపట్టణం జిల్లా వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ నగరంలో మాత్రం చతికిలబడింది. అయినా కూడా చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుని విశాఖ నగర మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మాదిరే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు తిరిగి టీడీపీ గూటికి చేరారు. ఈ క్రమంలో ఇటీవలే మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కూటమి ఆమెను పదవి నుంచి తొలగించేసింది. తాజాగా విశాఖ నగర మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికలో కూటమి తన అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించింది. పీలా అభ్యర్థిత్వాన్ని జనసేన ప్రతిపాదించగా.. బీజేపీ సమర్థించింది. ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించి వాకౌట్ చేయగా… విశాఖ మేయర్ గా పీలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరోవైపు టీడీపీకి మంచి పట్టు ఉన్న గుంటూరులోనే ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. కూటమి అధికారంలోకి రాగానే… వైసీపీకి చెందిన కీలక కార్పొరేటర్లంతా టీడీపీలో చేరిపోయారు. ఫలితంగా మొన్నటిదాకా మేయర్ గా కొనసాగిన కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ నుంచి కూడా ఆయన పెద్దగా మద్దతు లభించలేదు. అదే సమయంలో కూటమి బలం పెరగడం, క్రమంగా కార్పొరేషన్ పై తన పట్టు కోల్పోవడంతో మనస్తాపంతో మనోహర్ మేయర్ పదవికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో సోమవారం గుంటూరు మేయర్ పదవికి ఎన్నిక జరగగా… కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర బరిలోకి దిగారు. వైసీపీ శిబిరంలోని ఇద్దరు కార్పొరేటర్లు చివరి నిమిషంలో ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో కోలెవమూడి రవీంద్రకు 34 ఓట్లు రాగా.. వైసీపీకి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా రవీంద్ర మేయర్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వెరసి ఒకే రోజు వైసీపీ చేతిలోని మూడు పురపాలికలను కూటమి హస్తగతం చేసుకుంది.

This post was last modified on April 28, 2025 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

17 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

4 hours ago