తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియనే లేదు… అప్పుడే రెండు రాష్ట్రాల్లో మరో ఎన్నికకు తెర లేసింది. అవి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలే కావడం గమనార్హం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం రేపటితో ముగియనుంది. ఈ నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతుండగా… ఏపీలో ఒక టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు… మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీలు బీఆర్ఎస్, వైసీపీలు దూరంగా ఉన్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల వల్ల తమకు ఏమీ లాభం లేదనో… లేదంటో విపక్షంలో ఉండి దుస్సాహసం చేయడం ఎందుకని భావించాయో తెలియదు గానీ.. ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.
అయితే తాజాగా రెండు రాష్ట్రాల్లో ఐదేసీ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ దఫా జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యే కోటా ఎన్నికలు. అసెంబ్లీలో సభ్యుల బలం ఉన్న అన్ని పార్టీలు కూడా బరిలోకి దిగక తప్పని ఎన్నికలు. ఆయా పార్టీలకు సభలో ఉన్న సభ్యుల సంఖ్య అధారంగా వీటి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
తెలంగాణ శాసన మండలిలో సభ్యులుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజుల్ హసన్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశంల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో వీరి స్థానాలకు కొత్తగా సభ్యులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీరిలో ఎగ్గే మల్లేశం కాంగ్రెస్ నేత కాగా… హసన్ మజ్లిస్ సభ్యుడు. ఇక మిగిలిన ముగ్గురూ బీఆర్ఎస్ నేతలే. ప్రస్తుతం సభలో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలను బేరీజు వేసుకుని చూస్తే… అధికార కాంగ్రెస్ కు 4 స్థానాలు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ఇప్పటికే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను వదులుకున్న బీఆర్ఎస్… ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకంగా రెండు స్థానాలను కోల్పోనుంది. అంటే, ఆ పార్టీకి డబుల్ లాసేనన్న మాట.
ఇక ఏపీ విషషయానికి వస్తే… 2024 ఎన్నికల దాకా 151 సీట్లతో అత్యంత బలంగా కనిపించిన వైసీపీ.. మొన్నటి ఎన్నికల్లో ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా… కూటమి బలం ముందు నిలబడలేమన్న భావనతో వైసీపీ పలాయనం చిత్తగించింది. పోటీ చేయకుండా పరువును కాపాడుకునే యత్నం చేసింది. తాజాగా షెడ్యూల్ విడుదలైన 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూదా దక్కే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ సీట్లలో ఏకంగా నాలుగు స్థానాలు టీడీపీ నేతల పదవీ కాలం ముగియడంతో జరుగుతున్నవే. వచ్చే నెలతో టీడీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వూరి రామారావు, తిరుమలనాయుడుల పదవీ కాలం పూర్తి కానుంది.
ఇక మొన్నటిదాకా వైసీపీలో కొనసాగిన జంగా కృష్ణమూర్తి ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లెక్కన జంగాను వైసీపీ ఎప్పుడో తన జాబితాలో నుంచి తీసివేసింది. ఈ ఐదు స్థానాలు కూడా సభలో సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా టీడీపీకే దక్కనున్నాయి. అంటే… మండలిలో టీడీపీ బలం పెరిగినా… వైసీపీ బలంలో ఎలాంటి మార్పు ఉండదన్న మాట. అంటే… బీఆర్ఎస్ మాదిరిగా ఈ ఎన్నికల ద్వారా వైసీపీ పెద్దగా కోల్పోయేదేమీ ఉండదనే చెప్పొచ్చు.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే.. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన జరగనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఇస్తారు. ఇక ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ మార్చి 20న జరగనుంది. ఓట్ల లెక్కింపును కూడా అదే రోజున పూర్తి చేసి ఫలితాలనూ అదే రోజు వెల్లడిస్తారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా… పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ వెంటనే ఫలితాలు కూడా అదే రోజున విడుదలవుతాయి.
This post was last modified on February 25, 2025 6:17 am
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…