ఉప్పెన విలన్ గానే కాక ఒక మంచి నటుడిగా విజయ్ సేతుపతికి తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే తను సోలో హీరోగా నటించినవి గత కొన్నేళ్లలో పెద్దగా ఆడలేదు. ఓటిటిలో వచ్చినవి సైతం అంతంత మాత్రంగానే స్పందన తెచ్చుకున్నాయి. అయితే మహారాజ విషయంలో నిర్మాతలు ఈ లెక్కలేవీ పట్టించుకోకుండా తమిళ్ తెలుగులో ఒకేసారి సమాంతర రిలీజ్ దక్కేలా చూసుకున్నారు. కంటెంట్ మీద నమ్మకం ఏ స్థాయిలో ఉందంటే ముందురోజే ప్రీమియర్లు వేశారు. మరి టైటిల్ కు తగ్గట్టు మహారాజ ఉన్నాడా లేదా
కథ
మహారాజ (విజయ్ సేతుపతి) సెలూన్ షాప్ నడుపుకుంటూ తల్లి లేని కూతురు కూతురు జ్యోతి (సచిన)ని ప్రాణంగా పెంచుకుంటాడు. ఆ అమ్మయి ఓసారి క్రీడల పోటీకి వేరే ఊరికి వెళ్తుంది. ఓ రాత్రి ఇద్దరూ ప్రాణంగా చూసుకునే ఇనుప చెత్తబుట్ట మహాలక్ష్మి మాయమవుతుంది. దీంతో మహారాజ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇంకో వైపు ఒంటరిగా ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వాళ్ళను హత్య చేసి బంగారం దొంగతనం చేసే సెల్వ(అనురాగ్ కశ్యప్) పాప పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని సంఘటన జరుగుతుంది. చివరికి మహారాజాకు ఏమైంది. ఇతనికి సెల్వకున్న సంబంధం ఏంటి, మహాలక్ష్మిలో ఏముందనేది తెరమీద చూడాలి.
విశ్లేషణ
హార్డ్ హిట్టింగ్ డ్రామాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం స్టోరీని నమ్ముకుని సాహసాలు చేసే దర్శకులు తక్కువ. నితిలన్ స్వామినాథన్ ఈ కోవలోకే చెందుతాడు. జీవితంలో దారుణమైన తప్పులు చేసినవాళ్లు ఖర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జన్మలోనే దారుణమైన శిక్షను అనుభవిస్తారనే పాయింట్ కు రివెంజ్ డ్రామా జోడించి మహారాజను రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మొదటి గంట కేవలం పాత్రల పరిచయాలే జరుగుతాయి. మహాలక్ష్మి పోయిందని మహారాజ పోలీస్ స్టేషన్ కు పదే పదే వచ్చే సన్నివేశాల్లో సున్నితమైన హాస్యం జోడించడంతో కాలక్షేపానికి లోటు లేకుండా టైం పాస్ అవుతుంది.
నితిలన్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఈ మహారాజకు ఆయువుపట్టుగా నిలిచింది. మొదటి సగంలో ఒకదానితో మరొకటి సంబంధం లేనట్టుగా అనిపించే సంఘటనలు వస్తాయి. ఏదో కనెక్షన్ ఉంటుందని అనుకుంటాం కానీ అదేంటనే క్లూ ఊహకు తట్టకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. దీనివల్ల ఒక రకమైన సస్పెన్స్ మెయింటైన్ అవుతూ ఎవరికి వారు అసలు ట్విస్టు ఏంటనే దాని గురించి రకరకాల ఊహాగానాలు చేస్తారు. దీని వల్ల అక్కడక్కడా డ్రామా నెమ్మదించినా సరే మరీ విసుగు రాకుండా కాలక్షేపం జరిగిపోతుంది. అలా అని నెరేషన్ సీరియస్ గా ఉండదు. సందర్భానికి తగ్గట్టు పోలీస్ స్టేషన్ లో వేయించిన జోకులు నవ్వులు పూయిస్తాయి. ఇది అక్కడికే పరిమితం.
మహారాజా వెతుకుతున్న మహాలక్ష్మి వెనుక ఏదో ప్రతీకారం ఉందనే డౌట్ మనసును తొలుస్తూనే ఉన్నా ఇంకోవైపు సెల్వకి దీనికి ఖచ్చితంగా సంబంధం ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగించడం ద్వారా ఆడియన్స్ ని విజయవంతంగా డైవర్ట్ చేయడంలో సక్సెసయ్యాడు. విశ్రాంతికు ముందు వచ్చే ఫైట్ ఎపిసోడ్ సగటు కమర్షియల్ సినిమా మీటర్ లోనే ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి ఉగ్ర రూపంతో శత్రువును తుదముట్టించే సీన్ ఒక్కసారిగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర జ్యోతికి జరిగిన అవమానానికి రగిలిన మహారాజా ఆక్రోశానికి, వెతుకుతున్న వాడు దొరికినప్పుడు వాడి ఊచకోతకు కలిగిన ఆనందానికి ముడిపెట్టిన తీరు బాగుంది.
ఇదంతా ఒక ఎత్తయితే సెకండ్ హాఫ్ లో వచ్చే మలుపులు ఒక్కో రహస్యాన్ని గుట్టు విప్పుతూ అసలేం జరిగిందనే క్రమాన్ని వివరిస్తూ అసలు విలన్ ని హఠాత్తుగా రివీల్ చేసే విధానం ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేకి నిదర్శనం. అనురాగ్ కశ్యప్ చేసే ఘోరాలకు అతన్నే చూస్తున్న మనకు ఏ మాత్రం ఊహకందని విధంగా ఇంకో దుర్మార్గుడు ఉన్నాడని చూపించడం పేలింది. కాకపోతే మహారాజ పగకు మూలకారణమైన అసలు సంఘటన అంత సులభంగా జీర్ణించుకోలేదు. అలాంటి పరిస్థితులు ఉండటం వాస్తవమే అయినప్పటికీ సభ్య సమాజం తలదించుకునే వ్యక్తులను ఈ రీతిలో బహిర్గత పర్చడం ఎక్కడో గుండెలను మెలి తిప్పుతుంది. ఎమోషన్ బాగా కుదిరింది.
అలాని అసలు లోపాలే లేవని కాదు. మహారాజ అన్ని వర్గాలకు చేరువయ్యేది కానీ. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు దీన్ని అంత సులభంగా అంగీకరించకపోవచ్చు. పైగా కథా కథనాలు ఎంటర్ టైన్మెంట్ కి దూరంగా వెళ్తాయి. బరువైన భావోద్వేగాలకు సిద్ధపడితే తప్ప ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సన్నివేశాలను తట్టుకోలేం. అంత క్రూరుడైన సెల్వకు సైతం సెంటిమెంట్ యాంగిల్ జోడించి మెప్పించడం నితిలన్ ప్రతిభకు నిదర్శనం. అయితే సినిమాలోని అసలు ట్విస్టు రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన ఒక సూపర్ హిట్ మూవీకి దగ్గరగా ఉండటం కాకతాళీయం అనిపించదు. అదేంటో ఇక్కడ చెప్పడం సబబు కాదు కనక చూశాక నిర్ణయించుకోచ్చు.
రిస్క్ తో కూడుకున్న కొత్త తరం ఆలోచనలకు నితిలన్ ప్రతినిధిగా అనిపిస్తాడు. ఇలాంటివి మరిన్ని వస్తేనే థియేటర్ అనుభూతికి కొత్త నిర్వచనం దక్కుతుంది. అయితే ఇలాంటి జానర్లు, కథలు అన్ని వర్గాలకు చేరుకునేవి కాదు కాబట్టి బాక్సాఫీస్ లెక్కల్లో ఏ స్థాయిలో నిలుస్తుందో ఊహించడం కష్టం. తమిళ ఒరిజినల్ వెర్షన్ గొప్పగా ఆడొచ్చు. కానీ తెలుగులో ఎంత స్థాయికి చేరుకుంటుందనేది జనాలు నితిలన్ ఆలోచనను ఎలా స్వాగతిస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. టైటిల్ కు తగ్గట్టు మహారాజా వేషంలో దర్పం రాజసం లేకపోవచ్చు కానీ క్రియేటివ్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలనే దాని మీద మంచి రెఫరెన్సుల్లో మహారాజా ఒకటిగా నిలిచే ఛాన్స్ ఎక్కువ.
నటీనటులు
విజయ్ సేతుపతి తన యాభైయ్యవ సినిమాకు సరైన కలయికను ఎంచుకున్నాడు. ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ డిమాండ్ చేయని సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కి వంద శాతం సంపూర్ణ న్యాయం చేశాడు. ఈయన కన్నా ఇంకెవరిని ఊహించుకోలేనంత గొప్పగా పండించాడు. అనురాగ్ కశ్యప్ ఒక సర్ప్రైజ్ ప్యాక్. తొలుత మాములుగా అనిపించినా క్లైమాక్స్ లో హత్తుకునేలా నటించాడు. జ్యోతిగా సచిన పతాక సన్నివేశాల్లో అదరగొట్టింది. ఎస్ఐగా నట్టికి మంచి స్కోప్ దొరికింది. ఒక సీన్లో విజిల్స్ వేయించుకుంటాడు. మమతా మోహన్ దాస్, భారతీరాజాలు కాసేపు కనిపిస్తారు. మణికందన్, అరుళ్ దాస్, నటరాజ సుబ్రహ్మణ్యం, మునీష్ కాంత్, తేనప్పన్, వినోద్ సాగర్ తదితరులు ఓకే .
సాంకేతిక వర్గం
విరూపాక్ష, మంగళవారం లాంటి చిత్రాలకు పని చేసిన అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మహారాజ సింహాసనం మీద వజ్రంలా ఒదిగిపోయింది. మంచి స్కోర్ తో సీన్లలో ఇంటెన్సిటీని బాగా వినిపించాడు. తక్కువే పాటలే ఉన్నా చెప్పుకోదగ్గవి కాదు. దినేష్ పురుషోత్తం ఛాయాగ్రహణం బాగుంది. పరిమిత లొకేషన్లు, ఎక్కువ ఆర్టిస్టులను బ్యాలన్స్ చేస్తూ చక్కని పనితనం చూపించాడు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ లో కొంత ల్యాగ్ తగ్గాల్సింది. సంభాషణలు మితంగా ఉండి ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. భారీ బడ్జెట్ డిమాండ్ చేసే ప్యాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి ఖర్చు విషయంలో ఎలాంటి అన్యాయం జరగలేదు
పాజిటివ్ పాయింట్స్
విజయ్ సేతుపతి
క్యాస్టింగ్
బలమైన స్క్రీన్ ప్లే
ఊహించని ట్విస్టులు
నెగటివ్ పాయింట్స్
కొంత నెమ్మదితనం
ఫ్యామిలీస్ రిస్క్ అనుకునే పాయింట్
ఫినిషింగ్ టచ్ : కట్టిపడేసే రాజా
రేటింగ్ : 3/5
This post was last modified on June 14, 2024 4:11 pm
నిన్న కేరళలోని కొచ్చిలో ఘనంగా నిర్వహించిన 'పుష్ప 2: ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, రష్మిక…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ…
అతి తక్కువ గ్యాప్ లో తమ కుటుంబానికి సంబంధించిన రెండు శుభవార్తలు పంచుకున్న నాగార్జున ఇద్దరు కొడుకులు వైవాహిక జీవితాల్లోకి…
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. అందుకే ఫాన్స్…
అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు…
థియేటర్లో కొత్తగా రిలీజైన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటిటిలో హెచ్డి ప్రింట్లు వచ్చాక ఆగుతాయా. ఎంత సాంకేతికత…