సమీక్ష – గామి

2.75/5

2 hr 27 min   |   Slow Burn - Drama   |   08-03-2024


Cast - Vishwak Sen, Chandini Chowdary, Ramya, Mohammad Samad and others

Director - Vidhyadhar Kagita

Producer - Karthik Sabareesh

Banner - Karthik Kult Kreations, V Celluloid

Music - Naresh Kumaran

ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న సినిమాలకు విడుదల సమయానికి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడం పెద్ద సవాల్. దాన్ని విజయవంతంగా చేసింది గామి టీమ్. ఆరేడు సంవత్సరాలకు పైగా దర్శకుడు విద్యాధర్ ఈ ఒక్క ప్రాజెక్టు మీదే పని చేయడంతో ట్రైలర్ చూసే దాకా అసలు దీని గురించి అవగాహన ఉన్న ఆడియన్స్ చాలా తక్కువ. ట్రైలర్ వచ్చాక లెక్కలన్నీ మారిపోయాయి. దానికి తోడు మంచి ప్రమోషన్లతో ఎక్కువ జనాలకు రీచ్ కావడంతో గామికి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. మరి అంచనాలు అందుకుందా

కథ

అఘోరాలతో నివసించే శంకర్(విశ్వక్ సేన్)కు మనుషులను తాకితే శరీరం రంగు మారిపోయి తీవ్రమైన బాధను అనుభవించే శాపం ఉంటుంది. దానికి విరుగుడుగా అరుదైన మూలికల కోసం హిమాలయాలకు బయలుదేరతాడు. తోడుగా రీసెర్చ్ కోసం అదే ప్రాంతానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న డాక్టర్ జాహ్నవి(చాందిని చౌదరి)వెంట వెళ్తుంది. ప్రయాణంలో ముందుకు వెళ్లే కొద్దీ శంకర్ కు ఊహించని ప్రమాదాలు ఎదురై ఎక్కడో దూరంగా ఉన్న మరో ఇద్దరిని రక్షించే బాధ్యత వచ్చి చేరుతుంది. అదేంటనేది తెర మీదే చూడాలి.

విశ్లేషణ

సామాన్యులకు అంతగా అవగాహన ఉందని లోతైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గామి ద్వారా ఒక థ్రిల్లర్ రూపంలో పరిచయం చేయాలనే దర్శకుడు విద్యాధర్ ఆలోచన పెద్ద సాహసం. స్టార్లే ఇలాంటి రిస్కులకు దూరంగా కమర్షియల్ గా సేఫ్ గేమ్ ఆడే ట్రెండ్ లో విశ్వక్ సేన్ లాంటి అప్ కమింగ్ హీరోతో ఇంత పెద్ద కాన్వాస్ ని ఊహించుకోవడం మెచ్చుకోదగినదే. బడ్జెట్ పరిమితులు ఉన్నా సరే వీలైనంత క్వాలిటీతో గొప్ప అనుభూతి ఇచ్చేందుకు పడ్డ తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది మూడు విభిన్న నేపధ్యాలను ముడిపెడుతూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని రాసుకున్న తీరు బాగున్నా చెప్పే క్రమంలో స్లో నెరేషన్ ని ఎంచుకోవడం కనెక్టివిటీని కొంచెం తగ్గించింది.

మాములు సినిమాల్లో మనం చూడని సరికొత్త ప్రపంచాన్ని విద్యాధర్ పరిచయం చేశాడు. హిమాలయాలు, అఘోరాలు, అక్కడ దొరికే అరుదైన మూలికా సంపద, ప్రమాదకర పరిస్థితులు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అయితే ప్రోమోస్ లో చూసినట్టు ఇది కేవలం వాటికి మాత్రమే సంబంధించినది కాదు. ఒకప్పుడు గ్రామీణ మహిళల మెడకు కత్తిలా మారిన దేవదాసి వ్యవస్థ, ప్రయోగాల పేరుతో బయటికి కనిపించని ల్యాబుల్లో వైద్యులు చేసే ప్రమాదకర ఆపరేషన్లు ఇలా వేర్వేరు థీమ్స్ ని తీసుకున్నారు. అయితే ఫ్లో నెమ్మదిగా వెళ్లడం, సీన్లు కొన్ని రిపీట్ అనిపించడం సగటు ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించకపోయే ప్రమాదం లేకపోలేదు.

శంకర్ అఘోరాగా మారే క్రమాన్ని, వాళ్ళ మధ్య అతను ఎలా జీవించాడనే ట్రాక్ ని సరిగా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. నేనే దేవుణ్ణిలో ఆర్యని బాలా చూపించిన తీరు మంచి ఉదాహరణ. కాని విద్యాధర్ గామిలో శంకర్ సమస్యకు పరిష్కారం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దీనికి తోడు హాలీవుడ్ తరహాలో పారలల్(సమాంతర) స్క్రీన్ ప్లేని అనుసరించడంతో హఠాత్తుగా ఒక ఎపిసోడ్ నుంచి మరోదానికి జంప్ చేయడం టెక్నికల్ గా బాగుంది కానీ సగటు ప్రేక్షకుల కోణంలో చూస్తే కొంత అయోమయం కలిగించేదే. అయినా సరే కట్టిపడేసే విజువల్స్ తో అసలలా ఎలా తీశారనే ఆశ్చర్యానికి గురి చేస్తూ నడిపించిన తీరు గామిని ఎక్కడిక్కడ కాపాడుతూ వచ్చింది.

డాక్టర్ గా చాందిని చౌదరి పాత్రని చక్కగా డిజైన్ చేసిన విద్యాధర్ సెకండ్ హాఫ్ లో ఓ కీలక ట్విస్టు తర్వాత ఆమెను చాలా సేపు మాయం చేయడం ఫ్లో పరంగా ఇబ్బంది పెడుతుంది. శంకర్ కు, దేవదాసిగా మారబోయే పాపకు, ల్యాబులో ఉన్న కుర్రాడికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో సులభంగా గెస్ చేసే అవకాశం లేకుండా మేనేజ్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో వాటికి సమాధానం ఇచ్చే తీరులో కొంత ల్యాగ్ కి చోటిచ్చాడు. శంకర్ వేటి కోసమైతే మంచు కొండల్లో సాహసం చేస్తున్నాడో ఆ మూలికల గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటాం. కానీ క్లైమాక్స్ లో సింహం ఎంట్రీ మినహాయించి మరీ గూస్ బంప్స్ అనిపించే హై మూమెంట్స్ అంతగా లేకపోవడం లోటు అనిపిస్తుంది.

టాలీవుడ్ కు కొత్త దిశగా ప్రయాణం చేయించాలని చూస్తున్న విద్యాధర్, విశ్వక్ సేన్ లాంటి వాళ్లకు ప్రోత్సాహం అవసరమే. వంద శాతం ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చకపోవచ్చు. కానీ కనీసం అరవై శాతం జనాల్ని మెప్పిస్తే బాక్సాఫీస్ లెక్కల్లో కమర్షియల్ సక్సెస్ అందుకోవచ్చు. కానీ గామి లాంటి అరుదైన ప్రయత్నాలు మిగిలిన నలభై లేదా ఇరవై శాతం క్యాటగిరీలో పడే రిస్క్ ఉంది కాబట్టి దీని స్టామినా ఏ స్థాయిలో రుజువవుతుందనేది కొద్దిరోజులు ఆగితే కానీ చెప్పలేం. పరిమితులున్న బడ్జెట్ లో ఇంత అవుట్ ఫుట్ తీసుకురావడం అభినందనీయం. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా విశ్వక్ ఇప్పుడైతే ఇలాంటివి ఒప్పుకోడేమో కానీ తన ఫిల్మోగ్రఫీలో గామి ప్రత్యేకంగా నిలుస్తుంది.

నటీనటులు

నటుడిగా ఛాలెంజ్ గా భావించి ఎప్పుడో ఒప్పుకున్న విశ్వక్ సేన్ అఘోరాగా విపరీతమైన భావోద్వేగాలు ప్రదర్శించే అవకాశం దక్కకపోయినా ఉన్నంతలో ఎక్కువ మాటలు లేకుండా శంకర్ గా నటించిన తీరు బాగుంది. ఆర్టిస్టులందరికీ ప్రాధాన్యం దక్కడం వల్ల విశ్వక్ కు వన్ మ్యాన్ షో చేసే ఛాన్స్ దక్కలేదు. చాందిని చౌదరి హుందాగా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయింది. చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన రమ్య పసుపులేటి యాక్టింగ్ బాగుంది. అభినయ, హారిక, సమద్ తో పాటు ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పరిచయం లేని క్యాస్టింగ్ ఉండటం వల్ల కొందరిని వెంటనే గుర్తుపట్టేలేకపోయినా కావాల్సిన అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడు

సాంకేతిక వర్గం

నరేష్ కుమరన్ నేపధ్య సంగీతం గామికున్న ప్రధాన బలం. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో బాగా ఆస్వాదించవచ్చు. లౌడ్ నెస్ లేకుండా నీట్ గా కంపోజ్ చేసిన తీరు బాగుంది. సందర్భానుసారంగా వచ్చే రెండు పాటలు ప్లస్సు మైనస్ రెండూ కాదు. విశ్వనాధ్ రెడ్డి ఛాయాగ్రహణంని అవార్డులకు పూర్తి అర్హత సాధిస్తుంది. విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన తీరు విద్యాధర్ ఆలోచనలకూ దన్నుగా నిలిచింది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ కొంత నిడివిని కంట్రోల్ చేయాల్సింది. డైరెక్టర్ చెప్పిన లీనియర్ ఫార్మట్ ని వీలైనంత అయోమయం లేకుండా కట్ చేసిన తీరు బాగుంది. కార్తీక్ శబరీష్ తో పాటు ఇందులో పాలు పంచుకున్న నిర్మాణ భాగస్వాములు కంటెంట్ నే నమ్మారు

ప్లస్ పాయింట్స్

విజువల్స్
తీసుకున్న నేపథ్యం
టెక్నికల్ వర్క్

మైనస్ పాయింట్స్

నెమ్మదిగా సాగే కథనం
మాస్ కు కనెక్ట్ కాలేని అంశాలు

ఫినిషింగ్ టచ్ : నెమ్మదే కానీ మెచ్చుకోదగినది

రేటింగ్ : 2.75 / 5