సమీక్ష – పెదకాపు 1

2/5

2 Hr 29 Mins   |   Action Rural   |   29-09-2023


Cast - Virat Karrna, Pragathi Shrivatsav, Rao Ramesh, Naga Babu, Anasuya

Director - Srikanth Addala

Producer - Miryala Ravinder Reddy

Banner - Dwaraka Creations

Music - Mickey J Meyer

కుటుంబ కథా చిత్రాలకు బాగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నారప్ప నుంచి రూటు మార్చేశారు. అది రీమేక్ కనక ఆయన ప్రతిభ గురించి ఎక్కువ చెప్పడానికి లేదు కానీ పెదకాపు 1 ట్రైలర్ చూశాక చాలా సీరియస్ ఇష్యూ నే తీసుకున్నట్టు అనిపించింది. అఖండ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ప్రొడక్షన్ లో విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రమోషన్లు గట్టిగానే చేశారు. అంచనాలు విపరీతంగా లేకపోయినా టాక్ నే నమ్ముకున్న పెదకాపు మెప్పించేలా ఉన్నాడా

కథ

1982 తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరం. గోదావరి తీరం లంక గ్రామాల్లో ఆధిపత్యం కోసం నిత్యం గొడవ పడే వర్గాలు రెండు. ఒకటి అగ్రకులానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేష్)ది. ఇతని దగ్గరే పెదకాపు(విరాట్ కర్ణ)తో పాటు అన్నయ్య పని చేస్తూ ఉంటారు. మరొకటి బాయన్న(ఆడుకాలం నరేన్)వర్గం. ఎన్నికల టికెట్ కోసం రక్తం ఏరులై పారుతూ ఊరిలో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాయమైపోయిందనున్న అక్కమ్మ(అనసూయ) తిరిగి వస్తుంది. ఆధిపత్య పోరులో ఎవరు నెగ్గారో అదే స్టోరీ

విశ్లేషణ

కులాల పోరులో డ్రామాని సృష్టించడం అంత సులభం కాదు. అందులోనూ కమర్షియల్ మీటర్ లో చెప్పాలనుకున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొలతలను సరిగ్గా రాసుకోవడం వల్లే రంగస్థలం రికార్డులు సృష్టించింది. పూర్తిగా కుదరకపోవడం వల్లే పలాస పెద్ద స్థాయికి వెళ్లలేకపోయింది. శ్రీకాంత్ అడ్డాల తన చిన్నతనంలో టిడిపి పెట్టినప్పటి సంఘటనలకు కాల్పనికత జోడించి పెదకాపు రాసుకున్నట్టు చెప్పారు. ఐడియా మంచిదే. బోలెడు స్కోప్, డెప్త్ రెండూ ఉన్నాయి. అయితే ఇలాంటి జానర్ ని టచ్ చేసినప్పుడు నాటకీయత చాలా అవసరం. తనకు అలవాటైన ధోరణిలో నెమ్మదిగా చెబుతానంటే ప్రేక్షకులు అంత ఓపిగ్గా భరించే కాలం కాదిది.

ఎక్కువ తక్కువ అసమానతల మధ్య గొడవల్లో మనుషులు ఎంతకైనా తెగిస్తారు, ఎంత దూరమైనా వెళ్తారనేది పెదకాపులోని మెయిన్ పాయింట్. గదిలో కట్టేసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందనే నానుడిని మనుషులకు వర్తింపజేసి ఒక వింటేజ్ డ్రామా సృష్టించాలనేది శ్రీకాంత్ అడ్డాల ఆలోచన. ఇక్కడి దాకా బాగానే ఉన్నా ఆచరణకొచ్చే సరికి సరైన రీతిలో క్యారెక్టరైజేషన్లు పండకపోవడంతో పాటు స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడంతో పెదకాపు నడక చాలా సుదీర్ఘంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదట్లోనే పాత్రలను నేరుగా పరిచయం చేసిన అడ్డాల వాటి మధ్య సంబంధాలను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం దెబ్బ కొట్టింది.

తీసుకున్న రాయిలో నిజాయితీ ఉన్నా దాన్ని శిల్పంగా మార్చే క్రమంలో అడ్డాల పడిన తడబాటు సెకండ్ హాఫ్ లో ఎక్కువైపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఊహించని షాక్ ఇచ్చి అప్పటిదాకా అటుఇటు ఊగుతున్న ఆసక్తిని నిలబెట్టిన దర్శకుడు ఆ తర్వాత చూపించబోయే సంఘటనలు ఇంకా గ్రిప్పింగ్ గా ఉండాలనే ప్రాధమిక సూత్రం మర్చిపోయారు. దీని వల్ల అక్కమ్మ ఎపిసోడ్ కి ప్రాధాన్యం పెరిగిపోయి పెదకాపు సైడ్ ట్రాక్ తీసుకుంటాడు. సత్యరంగయ్య కొడుకు, బాయన్నల మధ్య ఊరి జనం ఎలా నలిగిపోయారని చూపించడం కన్నా పెదకాపు ఎలివేషన్ల కోసం ఏమేం పెడితే బాగుంటుందనే దాని మీద దృష్టి ఎక్కువైపోయి కథనంలో బిగి సడలింది.

దానికి తోడు సాధారణ ప్రేక్షకులకు కొంత అయోమయం కలిగించేలా పెదకాపు నడవడం మరో మైనస్. సంబంధాలు అర్థం చేసుకునే లోపలే కొన్ని క్యారెక్టర్లు చనిపోతాయి. ఇంకొన్ని ట్విస్టులు అర్థం కావాలంటే సినిమాలోని మొదటి పది నిముషాలు గుర్తు చేసుకుంటే తప్ప క్లారిటీ రాని పరిస్థితి. అక్కమ్మకిచ్చిన బిల్డప్ ని సరైన రీతిలో వాడుకుని ఆమె నడిపే రాజకీయం ద్వారా ఎందరు బలయ్యారనే థీమ్ ని శ్రీకాంత్ అడ్డాల సరిగా చూపించలేదు. దానికి తోడు తనే పోషించిన బుల్లబ్బాయ్ పాత్రకు కావాల్సిన ఇంటెన్సిటీ సరిగా పలికించలేకపోవడంతో ఆ క్రూరత్వాన్ని ఫీల్ కాలేక రాంగ్ ఛాయస్ గా ఫీలవుతాం. క్యాస్టింగ్ లో జరిగిన పొరపాట్లు చాలానే ఉన్నాయి.

భావోద్వేగాలు బలంగా పండాల్సిన పెదకాపులో అవే సరిగా కుదరలేదు. పెదకాపు అన్నయ్య మాయమైనప్పుడు, ప్రాణంగా చూసుకునే గౌరీ దుర్మార్గానికి బలైనప్పడు మనలో ఎలాంటి ఎమోషన్స్ కలగవు. కారణం ప్రతి ఫ్రేమ్ లో హింస డామినేట్ చేయడమే. పెదకాపుని ఏదో జనం కోసం పోరాడే వీరుడిగా నాగబాబుతో ప్రొజెక్ట్ చేయించారు కానీ నిజానికి అతను కుటుంబానికి తప్ప ఆ ఊరికి కనీసం తన వర్గానికి చేసిన గొప్ప పనేం లేదని ఈజీగా అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఎన్టీఆర్ కోరిమరీ టికెట్ ఇచ్చారనే రేంజ్ లో ఊదరగొట్టడం సింక్ అవ్వలేదు. అనురాగ్ కశ్యప్, వెట్రిమారన్ తరహాలో ఏదో రా అండ్ రస్టిక్ గా ప్రయత్నిద్దామనుకున్న అడ్డాల ఆచరణలో గెలవలేదు.

నటీనటులు

కొత్తబ్బాయి విరాట్ కర్ణ లుక్స్ బాగున్నాయి. ఉడుకురక్తంతో ఊగిపోయే పెదకాపుగా మంచి ఛాయసే. కానీ బరువైన సీన్స్ ని మోయలేక చాలా చోట్ల తేలిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కుర్రాడు ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రగతి శ్రీవాత్సవ అందంగా ఉంది. నటన పర్వాలేదు. రావు రమేష్ కి కొట్టిన పిండి ఇచ్చేశారు. నరేన్ కొంచెం ఓవరనిపించినా ఎబ్బెట్టుగా లేరు. భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావులు అనుభవంతో నెట్టుకొచ్చారు. ప్రవీణ్ యండమూరికి ఎక్కువ స్కోప్ దక్కింది. నటుడిగా శ్రీకాంత్ అడ్డాల ఆ పాత్ర డిమాండ్ చేసిన ఎక్స్ ప్రెషన్లు పూర్తిగా ఇవ్వలేదు.. పెదకాపు అన్నయ్యగా చేసినతను నప్పలేదు. అనసూయ నేపథ్యం బాగున్నా సరిగా వాడుకోలేదు.

సాంకేతిక వర్గం

మిక్కీ జె మేయర్ పాటల పరంగా ఎలాంటి మేజిక్ చేయలేకపోయారు. అసలు ఇలాంటి బ్యాక్ డ్రాప్ కి ఆయన సంగీతం సూటవ్వదని ముందే గుర్తించాల్సింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఊహించని విధంగా బాగా ఇచ్చారు. ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణంలో అనుభవం తొంగి చూసింది. గత కొన్నేళ్లలో ఆయన బెస్ట్ వర్క్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అప్పటి వాతావరణాన్ని ఆర్ట్ వర్క్ సహాయంతో కెమెరాలో గొప్పగా చూపించారు. పీటర్ హైన్ ఫైట్స్ బాగానే కుదిరాయి. మార్తాండ్ కె వెంకటేష్ లాంటి సీనియర్ కి ఎడిటింగ్ బాధ్యతలు ఇవ్వడంతో వీలైనంత ల్యాగ్ లేకుండా చూశారు కానీ సాధ్యం కాలేదు. ద్వారకా క్రియేషన్ ప్రొడక్షన్ వేల్యూస్ ని మెచ్చుకోవలసిందే

ప్లస్ పాయింట్స్

గ్రామీణ నేపథ్యం
బిజీఎం
ఛోటా కెమెరా పనితనం

మైనస్ పాయింట్స్

మితిమీరిన రక్తపాతం
కుదరని భావోద్వేగాలు
పాటలు
నెమ్మదిగా సాగే కథనం

ఫినిషింగ్ టచ్ : బరువనిపించే మోపు

రేటింగ్ : 2 / 5