స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోగా అభిరాం మీద దగ్గుబాటి అభిమానులకు కొద్దిపాటి ఆసక్తే ఉంది. అలాంటిది సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కావడం అంత సులభం కాదు. అయినా దర్శకుడు తేజ కాబట్టి న్యూ కుమార్స్ ని పరిచయం చేయడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది కనక ఏదైనా మ్యాటర్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ట్రైలర్ చూశాక అంతగా నమ్మకం కలగలేదు కానీ టీమ్ మాత్రం ప్రమోషన్లు విస్తృతంగా చేసింది. మరి కొత్త కుర్రాడు మెప్పించాడా, టైటిల్ లో హింస ఉన్నా సినిమా అంచనాలకు తగ్గట్టు ఉందా
కథ
భయం తప్ప మరో ఫీలింగ్ లేని రఘు(అభిరాం)అహింసనే అన్ని సమస్యలకు పరిష్కారమని నమ్ముతాడు. ఇతనంటే ప్రాణమిచ్చే మరదలు అహల్య(గీతికా తివారి) ఓసారి రోడ్డు మీద వెళ్తుండగా బడా వ్యాపారవేత్త దుశ్యంతరావు(రజత్ బేడీ) కొడుకుల చేతిలో అఘాయిత్యానికి గురవుతుంది. లాయర్ లక్ష్మి(సదా) సహాయంతో కోర్టులో పోరాడేందుకు అహల్య కుటుంబం నిర్ణయించుకుంటుంది. అయితే ముఖర్జీ(మనోజ్ టైగర్) వచ్చాక వ్యవహారం హింసాత్మకంగా మారుతుంది. చివరికి ఈ జంట ఏమయ్యిందో తెరమీద చూడాలి
విశ్లేషణ
ఒకప్పటి వింటేజ్ దర్శకుడిగా తేజ మీద ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయమే ఉంది. చిత్రం, నువ్వు నేను సాధించిన విజయాలు అలాంటివి. కానీ మారిన ట్రెండ్ కు తగ్గట్టు తనను తాను అప్డేట్ చేసుకోకుండా ఇంకా ఓల్డ్ స్కూల్ లోనే ఉండిపోవడం తేజకు ఫెయిల్యూర్స్ ని ఇస్తోంది. ఇవి నువ్వు నేను నాటి రోజులు కావు. ఓటిటిలు టెక్నాలజీలు లేని కాలంలో జయం లాంటి వాటిని పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇది జరిగి దశాబ్దాలు గడిచిపోయింది. కానీ తేజ మాత్రం అక్కడే ఉండిపోయారు. కథనం ట్రీట్ మెంట్ వగైరా అప్పటి జనాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకోవడం వల్ల ఇప్పటి తరానికి ఆయన కనెక్ట్ కాలేకపోవడం వాస్తవం.
అహింసలో తీసుకున్న పాయింట్ కి బోలెడు స్కోప్ ఉంది. హీరోయిన్ ని రేప్ విక్టిమ్ ని చేయడం చాలా అరుదు. తేజ ఆ రిస్క్ చేశారు. మంచిదే. ఏ ఇమేజ్ లేని అభిరాం హీరో కాబట్టి చూసేవాళ్ళు ఈ అంశాన్ని రిసీవ్ చేసుకుంటారు. కానీ దాన్ని సరైన రీతిలో హ్యాండిల్ చేయాలి. మొదటి సీన్లోనే స్పెషల్ ఆఫీసర్ గా రవి కాలే ఎంట్రీతో మొదలుపెట్టి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్ల జోకులు దాకా అంతా మాములుగా జరిగిపోతుంది. రఘు అహల్యల ఇంట్రో, వాళ్ళ మధ్య రొమాన్స్ పసలేక చప్పగా సాగిపోతుంది. మానభంగం జరిగాక తేజ అలెర్ట్ చేస్తాడు. ఇది సాధారణంగా ఊహించం కాబట్టి ఇక్కడి నుంచి ఏదో డిఫరెంట్ గా చూడబోతున్నామని గట్టిగా ప్రిపేరవుతాం
కోర్టు ఎపిసోడ్లు మరీ బ్యాడ్ గా కాకుండా ఓ మోస్తరుగా బాగానే సాగుతాయి. ఇక్కడా రెగ్యులర్ ట్రీట్ మెంట్ ఉన్నప్పటికీ సీన్లు బోర్ కొట్టకుండా నడిపించారు. అభిరాం ఎంత బలహీనంగా నటిస్తున్నా సరే సన్నివేశాల్లోని డెప్త్ వల్ల దారుణంగా మారకుండా అడ్డుపడ్డాయి. లాయర్ లక్ష్మి పాత్ర ద్వారా ఆసక్తికరమైన మలుపు ఇచ్చిన తేజ ఆ క్యారెక్టర్ ని అర్ధాంతరంగా రావుగోపాలరావు స్టైల్ లో ట్విస్టు ఇవ్వడం అంతగా మింగుడుపడదు. ఇక్కడి నుంచి గ్రాఫ్ పడిపోవడం మొదలవుతుంది. రఘు అహల్యలు అడవికి చేరుకున్నాక వాళ్లకు పెద్దగా పనుండదు. సహజంగానే తేజకూ ఈ డౌట్ వచ్చి ఇంకో గంటంపావు ఎలా నడిపించాలో అర్థం కానీ అయోమయం తెరమీద కనిపిస్తుంది
దీంతో అక్కర్లేని ట్రాక్స్ ఎంట్రీ ఇస్తాయి. ఫారెస్ట్ లో తుపాకీల వ్యాపారం చేసే ఒక దొంగల ముఠాని ప్రవేశపెట్టారు. బావా వెళ్లి విలన్లను చంపిరా అనగానే రఘు పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వెళ్లి గన్ను ఇమ్మని బ్రతిమాలడం ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది కాస్తా కామెడీ అయిపోయింది. ఇక్కడి నుంచి ఉదయ్ కిరణ్, నితిన్ లను గతంలో పరిగెత్తిచినట్టు అభిరాం, గీతికలతో రన్ రాజా రన్ పరుగు పందెం పెట్టేశారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఈజీగా ఊహించగలిగినప్పుడు వీలైనంత క్రిస్పీగా ముగించేయాలి. కానీ అలా జరగదు. మీ ఓపిక ఎంత ఉందో చూస్తామని థియేటర్ లో కూర్చున్న వాళ్ళను సవాల్ విసిరినట్టుగా రిపీట్ అవుతూనే ఉంటాయి.
ఇదంతా కాకుండా ఒక ప్రేమ జంట తమను బాధితులుగా మార్చిన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకునే లైన్ మీద నడిపించినా తేజ పాస్ అయిపోయేవారు. అలా కాకుండా అహింసను కూడా పాత టెంప్లేట్ లోకి తీసుకెళ్లడం ద్వారా మంచి టెక్నికల్ టీమ్ కూడా నిస్సహాయంగా మారేలా చేశారు. తర్కానికి తావు లేకుండా చిత్తానికి జరిగిపోయే సంఘటనలు చూస్తూ బిత్తరపోవడం తప్ప ఏమీ చేయలేం. తేజలో టెక్నీషియన్ ఇంకా యాక్టివ్ గా ఉన్నాడు. కానీ ఆయన మెదడుని విషయం లేని రైటర్ ఆక్రమించుకోవడం వల్ల అహింస, సీత లాంటి అవుట్ ఫుట్స్ వస్తున్నాయి. కేవలం దర్శకత్వానికి పరిమితమైతేనే పాత తేజని మళ్ళీ చూసుకోవచ్చు
నటీనటులు
అభిరామ్ నటనలో ఇంకా ఏబీసీ దగ్గరే ఉన్నాడు. కానీ రఘు పాత్ర జెడ్ దాకా డిమాండ్ చేసేంత బరువుంది. అందుకే మోయలేకపోయాడు. ఒక్క భయాన్ని మాత్రం పలికించగలిగాడు కానీ మిగిలిన ఎక్స్ ప్రెషన్ల దగ్గర తేలిపోయాడు. గీతికా పర్వాలేదు. అందం కూడా ఓకే. సదా ఉన్న కాసేపు గుర్తింపు మిస్ కాలేదు. రజత్ బేడీ విగ్రహం నిండుగా ఉండి కేకలు పెట్టడం తప్ప ఇంటెన్స్ విలనీని పండించలేకపోయింది. మోకాళ్ళ నొప్పులు వచ్చినవాడిలా కుంటుతూ నడిచే స్పెషల్ విలన్ గా మనోజ్ టైగర్ బాగున్నాడు. కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు ఉన్నంతలో ఓకే. అసలు పేర్లే తెలియని తారాగణం చాంతాడంత ఉంది
సాంకేతిక వర్గం
ఆర్పి పట్నాయక్ పాటల్లో ఒకటే బాగుంది. మిగిలినవి బయటికి వెళ్ళడానికి ఉపయోగపడ్డాయి. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక దశ వరకు బాగానే అనిపించినా తర్వాత సౌండ్ ఎక్కువైపోయింది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు. అనుభవం తాలూకు అడ్వాంటేజ్ ఇది. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టి ఉంటే కనీసం ల్యాగ్ తగ్గేది. అనిల్ సంబాషణలు అంతగా ఆకట్టుకోవు. అహింసను కృష్ణతత్వంతో ముడిపెట్టే లాజిక్ సింక్ అవ్వలేదు. రమణ సతీష్ ల ఫైట్లు ఓకే. నిర్మాణ విలువల మీద కంప్లయింట్ లేదు. ఆనంది ఆర్ట్స్ ఖర్చు విషయంలో మరీ తగ్గదు.
ప్లస్ పాయింట్స్
మెయిన్ ప్లాట్
కోర్ట్ డ్రామా
ఛాయాగ్రహణం
మైనస్ పాయింట్స్
విసిగించే నేరేషన్
సెకండ్ హాఫ్
రిపీట్ సీన్స్
పాటలు
ఫినిషింగ్ టచ్ : మితిమీరిన హింస
రేటింగ్ : 2/5
This post was last modified on June 3, 2023 1:08 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…