మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా తనకంటూ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో కేవలం మాస్ కి కట్టుబడకుండా ప్రయోగాలు చేస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్. గత చిత్రం రిపబ్లిక్ ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ తన అభిరుచి ఏంటో బయట పడింది. ఈసారి అంతకన్నా విభిన్నంగా విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకుని మీడియాతో, పబ్లిక్ ముందుకు తేజు వచ్చిన మూవీ ఇదే. ట్రైలర్లు గట్రా చూశాక అంచనాలు కూడా బాగున్నాయి. మరి పరీక్షలో విరూపాక్ష గెలిచాడా
కథ
ఇది 1990 నేపథ్యంలో జరుగుతుంది. చుట్టూ అడవి ఉండే రుద్రవరం అనే చిన్న ఊరికి తల్లితో కలిసి వస్తాడు సూర్య(సాయిధరమ్ తేజ్). తొలి చూపులోనే సర్పంచ్ కూతురు నందిని(సంయుక్త మీనన్)ని ప్రేమిస్తాడు. అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడి ఆ గ్రామా ప్రజలు ఒక్కొక్కరిగా ఆత్మహత్య చేసుకోవడం మొదలుపెడతారు. ఆలయ పూజారి(సాయిచంద్) దైవ శాసనం చదివి అష్టదిగ్బంధనం విధిస్తాడు. ఈ మరణాల వెనుక కారణం పసిగట్టేందుకు సూర్య నడుం బిగించి ప్రాణాలను రిస్క్ లో పెట్టి పరిశోధన మొదలుపెడతాడు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడి మొత్తం ఊరే శ్మశానంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది తెరమీద చూడాలి.
విశ్లేషణ
చేతబడి ఆధారంగా సినిమాలు రావడం టాలీవుడ్ లో ఏనాడో తగ్గిపోయింది. ఈ జానర్ లోకి కామెడీ ప్రవేశించి ఎప్పుడైతే దెయ్యాలతో కూడా నవ్వించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి సీరియస్ హారర్ ని రాసేవాళ్ళు కనుమరుగయ్యారు. ఈ గ్యాప్ ని సరిగ్గా పసిగట్టాడు దర్శకుడు కార్తీక్ దండు. నమ్మకం ఉన్నా లేకపోయినా ఆత్మలు, పునర్జన్మలు, మోక్షం లాంటివి సగటు మనిషి జీవితంలో ఏదో రూపంలో ముడిపడుతూనే ఉంటాయి. అక్షరాస్యత తక్కువగా ఉండే పల్లె జనంలో ఇవి మరీ ఎక్కువ. ముగ్గు వేసి బొమ్మని పెట్టి తల వెంట్రుకల సహాయంతో దూరంగా ఉన్న వాళ్ళను చిత్రహింస చేయడాన్ని బ్లాక్ మేజిక్ అంటాం. ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికీ ఆనవాళ్లున్నాయి
ఈ నేపధ్యాన్ని పేపర్లలో వచ్చిన నిజమైన సంఘటనల ఆధారంగా కార్తీక్ దండు ఈ విరూపాక్షను రాసుకున్నాడు. ఎలాంటి అనవసర అంశాలకు చోటివ్వకుండా సిన్సియర్ స్టోరీ టెల్లింగ్ కి కట్టుబడ్డాడు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని సైతం కేవలం సుకుమార్ సలహా మేరకు పెట్టానని చెప్పిన ఇతను ప్రారంభం నుంచి చివరి దాకా ఎలాంటి డైవెర్షన్లకు చోటివ్వలేదు. మూఢ నమ్మకానికి నమ్మకానికి మధ్య సన్నని గీతని చెరపకుండానే ఇటు దెయ్యం ఉందని చెబుతూనే మరోవైపు దైవశక్తి గొప్పదనే పాయింట్ ని అంతర్లీనంగా చెబుతూ మెప్పించాడు. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే ఏ ట్విస్ట్ ఎక్కడ పడాలో సరిగ్గా అక్కడే కుదిరి క్లూస్ పట్టుకునే ఛాన్స్ ఇవ్వలేదు
ఊళ్ళో చావులను ఒక్కొక్కటిగా ఆడియన్స్ కి రిజిస్టర్ చేసే క్రమంలో కార్తీక్ కొంత టైం తీసుకున్నప్పటికీ ఇంటర్వెల్ నుంచి గేరు పూర్తిగా మార్చేశాడు. ఇక్కడి నుంచి కథనం పరుగులు పెడుతుంది. ఊపిరి బిగబట్టే, కుర్చీల అంచుకు వచ్చే రేంజ్ లో కాదు కానీ ఊహించే విధంగా ఏది జరగనట్టుగా తన తెలివిని రైటింగ్ లో చూపించాడు. అసలు విలన్ ఎవరనేది ప్రీ క్లైమాక్స్ కి ముందే కనక ఊహించగలిగితే మీకు ఖచ్చితంగా గొప్ప సినిమా రచయిత మేధస్సు ఉన్నట్టే. దీన్నే ఇంటెలిజెంట్ థింకింగ్ అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ క్రితం ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో రాజేంద్రప్రసాద్ కాష్మోరా లాంటివి వచ్చాయి కానీ మేకింగ్లో ఉన్న ఫ్రెష్ నెస్ విరూపాక్షని ప్రత్యేకంగా మార్చింది
అలా అని ఇందులో ప్రతిదీ ఎక్స్ ట్రాడినరీ అని కాదు. కొన్ని హెచ్చుతగ్గులు లేకపోలేదు. చివరి ఘట్టంలో రహస్యమేంటో రివీల్ అయ్యాక నడిచే ఎపిసోడ్ అంత నమ్మశక్యంగా అనిపించదు. కార్తిక్ తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ లాజిక్స్ ని ప్రశ్నించేలా చేస్తుంది. హంతకుడిని పట్టుకోవడానికి బయలుదేరిన సూర్యకు ఎదురయ్యే సంఘటనలను గూస్ బంప్స్ అనిపించేలా ప్రెజెంట్ చేయలేదు. అలా అని నిరాశపరచలేదు కానీ ఇంకొంచెం హై మూమెంట్స్ పడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కొన్ని పాత్రల మీద అనుమానం వచ్చేలా అప్పుడెప్పుడో వచ్చిన వంశీ అన్వేషణ స్టైల్ లో కార్తీక్ రాసుకున్న సన్నివేశాలు అట్టే సమాధానం దొరక్కుండా చేయడం బాగుంది.
స్టోరీల కోసం కుస్తీలు పడుతూ అయితే లవ్ స్టోరీ లేదా మాస్ మసాలా చుట్టే తిరుగుతున్న తెలుగు సినిమా న్యూ జనరేషన్ డైరెక్టర్ల వల్ల కొత్త పుంతలు తొక్కుతోంది. కార్తికేయ 2, బింబిసార విజయాలు వాళ్లకు బలనివ్వగా ఇప్పుడీ విరూపాక్ష కూడా మరో కొత్త దారిని చూపించింది. ఒకే సినిమా(భం భోలేనాథ్) అనుభవమున్న కార్తీక్ దండు ఇన్నేళ్ల నిరీక్షణకు తగ్గ ఫలితం విరూపాక్షతో దక్కేలాగే ఉంది. మాస్, యువత, థ్రిల్లర్ లవర్స్ నుంచి మద్దతు పొందటంలో అనుమానం లేదు కానీ ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ హారర్ డ్రామాకు ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఈజీగా దగ్గరయ్యేలా లేరు. కలెక్షన్ల కొలతలని ఈ అంశం కొంతమేర ప్రభావితం చేయొచ్చు
నటీనటులు
కమర్షియల్ ఉచ్చులో పడిపోకుండా విరూపాక్ష లాంటి ఎక్స్ పరిమెంట్లకు సిద్దపడినందుకు సాయిధరమ్ తేజ్ ని మెచ్చుకోవాలి. కంటెంట్ మీద ఆధారపడ్డ సినిమా కావడంతో నటనపరంగా మరీ ఛాలెంజింగ్ అనిపించే స్కోప్ తక్కువగా ఉన్నా ఉన్నంతలో చక్కగా మెప్పించాడు. సంయుక్త మీనన్ కి చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర దక్కింది. కమల్ కామరాజు భారీ గ్యాప్ తర్వాత కనిపించాడు. సాయిచంద్, రాజీవ్ కనకాల, యాంకర్ శ్యామల, సునీల్, అజయ్ తదితరుల అనుభవం తెరనిండుగా కనిపించడంతో పాటు వాటిని సరిగ్గా పండించడానికి ఉపయోగపడింది. చిన్న ఆర్టిస్టులను కార్తీక్ దండు చాలానే తీసుకున్నాడు. అందరూ సహజంగా చేశారు.
సాంకేతిక వర్గం
శాండల్ వుడ్ ఫేమ్ అజనీష్ లోకనాథ్ నేపధ్య సంగీతం విరూపాక్షకు ప్రాణంగా నిలిచింది. హోరెత్తిపోయే శబ్దాలు లేకుండా ఎంత మోతాదులో సౌండ్ ఇస్తే భయం పుడుతుందో సరిగ్గా అంతే ఇవ్వడం పెద్ద ప్లస్. ఉన్న రెండు పాటలు లేకపోయినా చెల్లిపోయేది. శ్యామ్ దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం రుద్రవరం నిజంగా ఉందేమోనన్న భ్రమ కలిగించింది. ఆయన పనితనం వల్లే కార్తీక్ దండు కోరుకున్న డెప్త్ స్క్రీన్ మీద వచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ వీలైనంత పరుగులు పెట్టే వెర్షన్ నే ఇచ్చింది. సాంగ్స్ మినహాయించి ప్రత్యేకంగా తీసేసేవి అనిపించలేదు. ఎస్విసిసి ప్రసాద్ సుకుమార్ ల సంయుక్త నిర్మాణ విలువల సబ్జెక్టు మేరకు అడిగినంత ఖర్చు పెట్టాయి
ప్లస్ పాయింట్స్
కథనం నడిచే విధానం
సాయిధరమ్ తేజ్ & సంయుక్త మీనన్
ట్విస్టులు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా నెమ్మదితనం
హారర్లో భాగమైన కొంత హింస
లవ్ ఎపిసోడ్
ఫినిషింగ్ టచ్ : థ్రిల్ ఇచ్చే చేతబడి
రేటింగ్ – 3 / 5
This post was last modified on April 21, 2023 1:07 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…