కొరటాలని టార్గెట్ చేయడం సబబేనా

నిన్న దేవర ట్రైలర్ వచ్చాక సోషల్ మీడియా మొత్తం దీని గురించిన చర్చతో నిండిపోయింది. పూర్తి యాక్షన్ కట్ తో వచ్చిన వీడియో అభిమానులకు ఫుల్ మీల్స్ అనిపించగా మిశ్రమ స్పందన ఇచ్చినవాళ్ళూ లేకపోలేదు.

కథను వీలైనంత ఎక్కువ రివీల్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా కట్ చేశారేమో కానీ దాని వల్ల కలిగిన అయోమయం కొందరికి నెగటివ్ అనిపించి ఉండవచ్చు. ఏది ఏమైనా రోజు తిరక్కుండానే పాతిక మిలియన్ల వ్యూస్ దాటేయడం అంటే మాటలు కాదు. రిలీజ్ ఇంకా పదహారు రోజుల సమయం ఉంది కాబట్టి అంచనాల పెరుగుదలలో చాలా మార్పులు చూడొచ్చు.

ఇదిలా ఉండగా కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా కొరటాల శివని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్న పోకడ ఎక్స్ లో కనిపిస్తోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చాడన్న కోపంతో కొందరు మెగా ఫ్యాన్స్, ఆర్ఆర్ఆర్ టైంలో మేమంటే మేం గొప్పని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పరస్పరం చేసుకున్న వాదనలు గుర్తు పెట్టుకుని మరికొందరు ఇలా రకరకాలుగా టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఇలా చేస్తున్న వాళ్ళు మిస్సవుతున్నది ఒక్కటే. డిజాస్టర్ ఇచ్చిన ఏ దర్శకుడైనా మళ్ళీ హిట్ ఇవ్వడని ఎక్కడా లేదు. మృగరాజు తీసిన గుణశేఖరే ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

సో పూర్తి సినిమా చూసేదాకా ఎలాంటి పోలికలు తెచ్చినా ఎన్ని ఉద్దేశపూర్వక మాటలు అన్నా లాభం లేదు. కొన్ని దేవర ఫ్రేమ్స్ లో ఆచార్య షేడ్స్ ఉన్నాయనే కామెంట్ మరీ విచిత్రం. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు వీటిని ఎలా వెనక్కు తీసుకుంటారనేది తారక్ అభిమానుల ప్రశ్న.

ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం వల్లే ఇంతగా టాపిక్ అయిపోయింది. అయినా అంత నమ్మకం లేనిదే వందల కోట్ల బడ్జెట్ తో దేవరని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకోరుగా. సెప్టెంబర్ 27 వచ్చేలోపు ఇలాంటి డిస్కషన్లు, వాదోపవాదాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.