గోట్.. మనోళ్లు తీర్మానించేశారు

గత దశాబ్ద కాలంలో తెలుగులో అత్యధిక విజయాలు అందుకున్న తమిళ హీరో ఎవరంటే విజయ్ పేరు చెప్పేయొచ్చు. ఒకప్పుడు తన సినిమాలు తెలుగులో రిలీజవడమే గగనంగా ఉండేది. కానీ తుపాకీ నుంచి కథ మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఇక్కడ ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకున్నాడు విజయ్.

జిల్లా, అదిరింది, విజిల్, మాస్టర్, లియో.. ఇలా విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో మంచి ఫలితాన్నందుకున్నాయి. వీటిలో మాస్టర్, లియో చిత్రాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్‌కు మాత్రం ఢోకా లేకపోయింది.

వారిసు సైతం డివైడ్ టాక్‌తోనే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ‘లియో’తో విజయ్ తెలుగు మార్కెట్లో పీక్స్ చూశాడు. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మీద కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

కానీ ‘గోట్’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. తెలుగులో తొలి రోజే ఈ సినిమా ఫలితమేంటో తేలిపోయింది. అర్లీ మార్నింగ్ షోల నుంచే ఫుల్ నెగెటివ్ టాక్ రావడంతో డే-1 సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది ‘గోట్’.

తెలుగు వెర్షన్ తొలి రోజు కేవలం 2.3 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది ఏపీ, తెలంగాణల్లో. రెండు రాష్ట్రాల్లో తమిళ వెర్షన్ కూడా రిలీజైంది. దానికి ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. తమిళనాట ‘గోట్’ మంచి టాక్, వసూళ్లతోనే సాగుతున్నా.. మిగతా ఎక్కడా ఆ సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.

తెలుగులో అయితే రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయి సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. మామూలుగా కేరళలో విజయ్ సినిమాలు బాగా ఆడతాయి. కానీ అక్కడ కూడా ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ రాలేదు. రెండో రోజు నుంచి పరిస్థితి దయనీయంగా ఉంది. కర్ణాటకలోనూ అంతే. యుఎస్‌లో కూడా ప్రిమియర్స్ తర్వాత రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు.