గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో ఆయన అభిమానులు ఎలా విలవిలాడిపోతున్నారో తెలిసిందే. ఆయనతో నేరుగా ఏ సంబంధం లేని సామాన్యులే ఇంత బాధ పడుతుంటే.. రక్త సంబంధీకుల పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. ఐతే పుట్టెడు దుఃఖంలో ఉన్న బాలు తనయుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ అసత్య ప్రచారం కారణంగా అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
బాలుకు నెలన్నర పాటు చికిత్స చేసిన చెన్నై ఎంజీఎం ఆసుపత్రి రూ.3 కోట్ల బిల్ వేసిందని.. అందులో సగానికి పైగా బిల్ పెండింగ్ ఉండటంతో బాలు కుటుంబం బాగా ఇబ్బంది పడిందని.. సమయానికి డబ్బుల్లేకుంటే తమిళనాడు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సంప్రదిస్తే ఆయన కూతురు జోక్యం చేసుకుని బిల్ సెటిల్ చేసి బాలు మృతదేహం బయటికి వచ్చేలా చేసిందని వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియాలో ఒక మెసేజ్ హల్ చల్ చేస్తోంది రెండు రోజులుగా. దీన్ని ఇప్పటికే ఒక వీడియో ద్వారా ఖండించాడు చరణ్.
అంతటితో ఆగకుండా చెన్నైలో సోమవారం అత్యవసరంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఎంజీఎం ఆసుపత్రి బాలును సొంత కుటుంబ సభ్యుడిలాగా చూసుకుందని చరణ్ తెలిపాడు. బిల్ విషయంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమంతా అబద్ధమని.. ఇది తమ కుటుంబం, ఆసుపత్రి వర్గాలతో పాటు అందరినీ ఎంతో బాధ పెట్టిందని చరణ్ అన్నాడు. ఐతే అసలు చర్చకు దారి తీసిన బిల్, దాని చెల్లింపు గురించి చరణ్ వివరాలు చెప్పలేదు. దీనిపై తాను, ఎంజీఎం ఆసుపత్రి ప్రతినిధులు కలిసి ఒక ప్రకటన విడుదల చేస్తామని, ఎంత బిల్లయిందో, దాన్ని ఎవరు కట్టారో అంతా అందులో వివరిస్తామని చరణ్ అన్నాడు. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలో చరణ్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం రావడం మాత్రం బాధాకరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates