డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తోన్న పాడ్ కాస్ట్స్ ఇప్పుడు యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా రెండు నుంచి అయిదు నిమిషాల పాటు వుంటోన్న ఈ పాడ్ కాస్ట్ లలో పూరీ అనేక విషయాలపై తన అనుభవాలను, జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
అలాగే యువతరంపై ముద్ర పడిపోయే విధంగా కొన్ని నీతులు కూడా చెబుతున్నాడు. ఇందులో ముఖ్యంగా పెళ్లి, పిల్లలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బోధించేవి ఎక్కువగా వుంటున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒక్క పాడ్ కాస్ట్ లో అయినా కానీ పూరి ఈ టాపిక్ ఎత్తుకుంటున్నాడు. పెళ్లి వద్దని బోధిస్తోన్న తనను చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ ఆ మాటలేమీ తాను పట్టించుకోనని, కనీసం భావితరం బాగుపడాలన్నా ఈ కుటుంబ బంధనాలు వుండకూడదని, హ్యాపీగా సంపాదించుకుని, నలభై ఏళ్లకే రిటైర్ అయిపోయి ప్రపంచమంతా చుట్టి రమ్మని, మనుషులు లేని దీవులలోకి వెళ్లిపోయి జంతువులతో పాటు కలిసి బ్రతకమని పూరి బోధిస్తున్నాడు.
కొన్ని బాక్టీరియాలు ఇక సంతానోత్పత్తి లేకుండా చేస్తాయని, త్వరలో పిల్లలు పుట్టడం గగనం అయిపోతుందని కూడా పూరి చెబుతున్నాడు. అమ్మాయిలయినా, అబ్బాయిలయినా పెద్దవాళ్ల ప్రోద్బలంతో పెళ్లి అనే రొటీన్‍లో పడిపోయి పనికి రాకుండా తయారు కావద్దని, అఛీవర్స్ లో చాలా మంది పెళ్లి చేసుకోలేదని గుర్తు చేస్తున్నాడు. చూస్తోంటే ఈ టాపిక్‍పై పూరి త్వరలో ఒక సినిమానే తీసేలా వున్నాడు.