సినిమా పైరసీని వెంటపడి పట్టుకున్నారు

పరిశ్రమను దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్య పైరసీ. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దాన్ని కట్టడి చేయడం సాధ్యపడటం లేదు. కొందరు విదేశీ సర్వర్ల నుంచి అప్లోడ్ చేస్తుండగా మరికొందరు దేశంలోని మారుమూల థియేటర్లలో రికార్డింగ్ చేసి సొమ్ములు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమ పెద్దలు చొరవ తీసుకోకపోవడంతో ఓటిటి కంటెంట్ సైతం వీటి బారిన పడక తప్పడం లేదు. ఇటీవలే ఈటీవీ విన్ తమ ప్లాట్ ఫార్మ్ మీదున్న వెబ్ సిరీస్ లను చౌర్యం చేయలేని విధంగా ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఫలితాలు బాగానే ఉన్నాయని రిపోర్ట్.

ఇదిలా ఉండగా ఒక మలయాళ నిర్మాణ సంస్థ తమ సినిమాను పైరసీ చేయడం తట్టుకోలేకపోయింది. ఎలాగైనా దీని అంతు చూడాలని కంకణం కట్టుకుంది. కొన్ని వారాల క్రితం కేరళలో గురువయూర్ అంబాలనడియిల్ రిలీజయ్యింది. రెండో రోజే ఆన్ లైన్ లో ప్రింట్ చూసి ప్రొడ్యూసర్లు షాక్ తిన్నారు. దీని మూలమేంటో ఛేదించాలని నిర్ణయించుకున్నారు. త్రివేండ్రంలోని ఆరిస్ మల్టీప్లెక్స్ సముదాయంలో ఒక మిత్రుల బృందం రెండు మూడు షోలకు ఒకేసారి అయిదారు రిక్లైనర్ సీట్లు బుక్ చేసుకుని అత్యాధునిక మొబైల్స్ లో ఉండే 4K వీడియో రికార్డింగ్ ద్వారా ఇదంతా చేస్తున్నారని పసిగట్టారు. ఇదెలా జరిగిందో చూద్దాం.

క్యూబ్ ద్వారా ప్రసారమయ్యే థియేటర్ స్క్రీనింగ్ ప్రతి ప్రింట్ కు బయటికి కనిపించని ఒక వాటర్ మార్కింగ్ ఉంటుంది. ఈ సాంకేతికతను ఫ్రాన్స్ కు చెందిన నెక్స్ గార్డ్ ల్యాబ్స్ అందిస్తుంది. దాని ద్వారా ఏ థియేటర్లో సినిమా రికార్డింగ్ చేసినా దాని ద్వారా ఏ స్క్రీన్ లో పైరసీ జరిగిందో పట్టుకోవచ్చు. ఇదే తరహాలో నిన్న విడుదలైన రాయన్ సినిమాని అదే బ్యాచ్ రికార్డింగ్ చేసే పనిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం దీని గురించి విచారణ జరుగుతోంది. నేరం ఋజువైతే జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. ఇలా పట్టువదలకుండా అందరూ ప్రయత్నిస్తే పైరసీని చంపేయొచ్చేమో.