కృష్ణవంశీని సిరివెన్నెల బాయ్ అనుకున్న వేళ..

లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి, ఏస్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ పరిశ్రమలో సిరివెన్నెలకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. వ్యక్తిగతంగా కూడా కృష్ణవంశీతో ఆయనకు గొప్ప అనుబంధం ఉంది. వంశీని ఆయన తన దత్తపుత్రుడిగా భావిస్తారు. కృష్ణవంశీ సినిమాలకు సిరివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు.

‘జగమంత కుటుంబం..’ సహా ఎన్నో సిరివెన్నెల రాసిన ఆణిముత్యాల్లాంటి పాటలు కృష్ణవంశీ సినిమాల్లో చూడొచ్చు. సిరివెన్నెలతో అనుభవాల గురించి ఓ టీవీ ఛానెల్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కృష్ణవంశీ.. తన గురువుతో తొలి పరిచయం గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తమ తొలి కలయికలో తనను సిరివెన్నెల బాయ్ అనుకున్న విషయాన్ని ఆయన పంచుకున్నారు.

“నా కెరీర్ తొలి రోజుల్లో సిల్క్ స్మిత గారి ప్రొడక్షన్లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. డైరెక్టర్ గారు సిరివెన్నెల గారికి కథ చెప్పేశాక.. పాటలు రాయించుకునే బాధ్యత నాకు అప్పగించారు. ఆయన పనిలో ఉండగా నేను లోపలికి వెళ్లేసరికి.. ‘కాస్త మంచి నీళ్లు, టీ తీసుకురా బాబు’ అన్నారు. నన్ను బాయ్ అనుకున్నారని అర్థమైంది. అయినా నా ఇగో హర్ట్ కాలేదు. అదే గురువుగారిని మొదటిసారి చూడడం. తర్వాత నేను అసిస్టెంట్ అని తెలుసుకుని ఒక పాట ఇచ్చి ఫెయిర్ చేయమన్నారు. నేను రాసిన విధానం చూసి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత మేమిద్దరం కలిసిన సందర్భం చాలా రోజులు రాలేదు. శివ, క్షణక్షణం, అంతం సినిమాలకు మేం స్నేహితులుగా మారిపోయాం. నేను దర్శకుడు అయ్యాక ఆయనతోనే చాలా వరకు పాటలు రాయించుకున్నా” అని కృష్ణవంశీ తెలిపాడు.