దేవర ఆగమనం ఇంకాస్త ముందుగానే

గత కొద్ది రోజులుగా అభిమానులను విపరీతమైన ఉత్కంఠకు గురి చేసిన దేవర విడుదల తేదీ మార్పు వ్యవహారం ముగింపుకొచ్చింది. ముందు ప్రకటించిన అక్టోబర్ 10 కాకుండా సెప్టెంబర్ 27 విడుదల చేయబోతున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. అంటే గతంలో చెప్పిన టైంకన్నా రెండు వారాల ముందున్న మాట.

ఇదే డేట్ ని ఇటీవలే అనౌన్స్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ముందుకో వెనక్కో జరగక తప్పదు. దీని నిర్మాణ సంస్థ సితారనే దేవరకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉండటంతో తారక్ కు ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ప్రస్తుతం దేవర గోవా షెడ్యూల్ జరుగుతోంది.

దసరా పండగను వదులుకున్నా సెప్టెంబర్ 27 దేవరకు చాలా మంచి డేట్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి పోటీ లేదు. ఏ ఇతర ప్యాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేసుకోలేదు కనక అన్ని భాషల్లోనూ మంచి స్క్రీన్ కౌంట్ దొరుకుతుంది. ఆపై రెండు వారాల పాటు రజనీకాంత్ వెట్టయాన్ వచ్చేదాకా స్పీడ్ తగ్గదు.

బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం నెల రోజుల పాటు స్టడీ రన్ కొనసాగించవచ్చు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఈ ఇంటెన్స్ డ్రామాని దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్ తో సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు.

ఏదైతేనేం జూనియర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనిట్ టాక్ ప్రకారం జూలైలోనే మొత్తం షూట్ పూర్తయిపోతుంది. ఆగస్ట్ నుంచి ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారు. దేవర లాక్ చేసుకోవడంతో ఆగస్ట్ 15 నుంచి తప్పుకునే అవకాశమున్న పుష్ప 2 ఏం చేస్తుందనే దాని మీద డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపాన్ని దేవర రూపంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.