నిఖిల్ మీద డౌట్లు తీరిపోయాయి


‘కార్తికేయ-2’ సినిమాతో యువ కథానాయకుడు నిఖిల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ దెబ్బతో అతను హీరోగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు తయారవుతున్నాయి. అందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. స్వయంభు. సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు.. కోలీవుడ్‌కు చెందిన కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారితో చేస్తున్న చిత్రమిది.

ఈ సినిమా ప్రకటించిన దగ్గర్నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఒక పెద్ద హీరో చేయాల్సిన స్కేల్‌లో భారీగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్టర్లతోనే సినిమా రేంజ్ ఏంటో అర్థమైంది. ఈ రోజు నిఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. యుద్ధ వీరుడి పాత్రలో నిఖిల్ ఏమాత్రం సూటవుతాడో అని సందేహాలు పెట్టుకున్న వాళ్లకు ఈ లుక్ చూశాక ఆ డౌట్లు అన్నీ తీరిపోయి ఉంటాయి.

కెరీర్లో ఇప్పటిదాకా అన్నీ మోడర్న్ టచ్ ఉన్న సినిమాలే చేసినప్పటికీ.. ‘స్వయంభు’ లాంటి పీరియడ్ మూవీకి తగ్గట్లు లుక్‌ను నిఖిల్ బాగానే మార్చుకున్నాడు. జులపాల జుట్టు.. కండలు తిరిగి దేహం.. పాత కాలం నాటి దుస్తులతో యుద్ధ వీరుడిగా నిఖిల్ లుక్ పర్ఫెక్ట్‌గా సూటయింది. ‘స్వయంభు’ చోళుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

ఒక సామాన్యుడిగా మొదలుపెట్టి తనకు తానుగా గొప్ప యోధుడిగా ఎదిగే ఒక కుర్రాడి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శతాబ్దాల కిందటి వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్టింగ్స్ వేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనోజ్ పరమహంస సహా పలువురు పేరున్న టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్తతో పాటు నభా నటేష్ నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.