ఈఎస్ఐ స్కామ్.. టీడీపీకి ఆయుధం దొరికింది

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను తవ్వి తీసి తెలుగుదేశం నాయకుల్ని ఇరుకున పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది జగన్ సర్కారు. ఇందులో భాగంగానే ఈఎస్ఐ స్కాంలో టీడీపీ అగ్ర నాయకుడు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. కానీ ఆయనపై అభియోగాలు రుజువయ్యేలా లేవు, ఆయనకు ఈఎస్ఐ స్కాంలో ప్రమేయం లేదు అన్నట్లుగా వార్తొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నకు బెయిల్ కూడా మంజూరైంది. అయినప్పటికీ ఆయనకు ముప్పు తొలగినట్లేమీ కాదు. ఐతే ఈ కేసు నుంచి అచ్చెన్నాయుడిని బయటపడేసేందుకు టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు అధికార పార్టీ మీద ఎదురుదాడి చేయడానికి ఒక ఆయుధాన్ని దొరకబుచ్చుకుంది టీడీపీ.

ఈఎస్ఐ కేసులో 14వ నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం వైకాపా మంత్రి జయరాంకు బినామీ అంటూ మాజీ మంత్రి, విశాఖ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మీడియా సమావేశంలో ఆరోపించారు. ఆ వ్యక్తి మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు ఇంతకుముందు బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన ఫొటోను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ కారు వెనుక గుట్టు ఏంటో తెలియాలన్న ఆయన.. ఈఎస్ఐ స్కాంలో మంత్రికి ప్రమేయం ఉందని.. కేసును నిష్పాక్షికంగా విచారిస్తే మంత్రి వ్యవహారం మొత్తం బయటికి వస్తుందని అన్నారు. వెంటనే జయరాంను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మంత్రి అవినీతి వ్యవహారాలకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నానని అయ్యన్న స్పష్టం చేశారు. మరి ఈ ఆరోపణలపై మంత్రి, వైకాపా నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.