ఎన్నికలకు సెలవు – సినిమాలకు స్వాగతం

సరైన సినిమాలు రాలేదనే కారణం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల ప్రభావం బాక్సాఫీస్ మీద తీవ్రంగా పడిన మాట వాస్తవం. వార్ వన్ సైడ్ అనకుండా ఈసారి టీడీపీ జనసేన కూటమి బలమైన పోటీ ఇవ్వడంతో అధికార పార్టీ వైసిపికి దాన్ని ఎదురుకోవడం కత్తి మీద సాములా మారింది.

దీంతో పోటా పోటీ ప్రచారాలతో పాటు గెలుపోటమలకు సంబంధించిన చర్చలతో జనం వేరే ప్రపంచం లేకుండా నెల రోజులు గడిపేశారు. దెబ్బకు థియేటర్లలో జనం లేక బయ్యర్లు, నిర్మాతలు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. యావరేజ్ టాక్ వచ్చినవి సైతం డిజాస్టర్ ఫలితాలు అందుకునే దాకా వెళ్ళింది.

ఇవాళ సాయంత్రం పోలింగ్ అయిపోతుంది కాబట్టి పబ్లిక్ క్రమంగా రాజకీయ ఊసులు పక్కనపెట్టేస్తారు. ఎలాగూ ఫలితాల ప్రకటనకు ఇంకో ఇరవై రోజుల సమయం ఉంది కనక జూన్ 4 దాకా పొలిటికల్ న్యూస్ కు చెక్ పడిపోతుంది. ఈ నేపథ్యంలో తిరిగి సినిమాలకు ప్రేక్షకులు వచ్చే సూచనలు క్రమంగా మెరుగవుతాయి.

ఈ శుక్రవారం మే 17 రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా పడటం ట్రేడ్ ని నిరాశపరిచింది. గెటప్ శీను రాజు యాదవ్ తప్ప పెద్దగా చెప్పుకునే రిలీజులు లేవు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని విక్రమ్ అపరిచితుడుని మళ్ళీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చివరి వారం నుంచి అసలైన జోష్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. విశ్వక్ సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ లాంటి నోటెడ్ హీరోలు కొత్త సినిమాలతో వస్తున్నారు కాబట్టి వేసవి సెలవులను కనీసం ఇవైనా వాడుకుంటాయనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

అద్దెలు, సిబ్బంది జీతాలు సైతం కిట్టుబాటు కాక చాలా థియేటర్లు, మల్టీప్లెక్సులు ఏప్రిల్ నుంచి చూస్తున్న నరకం మామూలుది కాదు. ముఖ్యంగా బిసి సెంటర్లకు ఫీడింగ్ ఇచ్చే బొమ్మ గత నలభై రోజులుగా ఒక్కటీ లేదు. సో ఎలక్షన్ల సౌండ్ అయిపోయింది కాబట్టి ఇకపై కల్కి, దేవర, ఓజి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.