ఎన్టీఆర్‌కు ఇది సవాలే..

నిన్నటితరం హీరోల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అక్కడ కొంచెం గుర్తింపు వచ్చింది కానీ.. లాంగ్ కెరీర్ అయితే లేకపోయింది. అందుకోసం వాళ్లు గట్టి ప్రయత్నాలు కూడా చేయలేదు. అప్పుడు పాన్ ఇండియా మార్కెట్ గురించి హీరోలు పెద్దగా ఆలోచించేవారు కాదు. కానీ ఇప్పుడు బౌండరీలు చెరిగిపోయి దేశవ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలూ క్లిక్ అవుతున్నాయి.

ముఖ్యంగా తెలుగు సినిమాలకు, తెలుగు హీరోలకు ఉత్తరాదిన మంచి ఆదరణ ఉంటోంది. ప్రభాస్ సినిమా అంటే ఉత్తరాదిన జనం ఊగిపోతున్నారు. అల్లు అర్జున్ సైతం ‘పుష్ప’తో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు నార్త్‌లో. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌లకూ మంచి గుర్తింపే వచ్చింది. ఈ ఫాలోయింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని ఆ ఇద్దరు హీరోలు చూస్తున్నారు.

తారక్ ‘దేవర’ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూనే ‘వార్-2’ రూపంలో నేరుగా హిందీ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమా షూట్ కోసం నిన్ననే అతను ముంబయిలో అడుగు పెట్టాడు. ఈ చిత్రంలో అతను మాచో స్టార్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఐతే హృతిక్‌తో కలిసి నటించడం అంటే అంత తేలిక కాదు. అంటే అతను తారక్ కంటే గొప్ప నటుడు అని కాదు. కానీ తన అప్పీయరెన్స్ మామూలుగా ఉండదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ లుక్స్ ఉన్న హీరోల్లో అతనొకడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అతను స్క్రీన్ మీద కనిపిస్తే పక్కనున్న వాళ్లందరూ తేలిపోతారు. తన లుక్స్‌తోె ప్రేక్షకులను అతను అరెస్ట్ చేసేస్తాడు. తారక్‌కు కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్సే ఉన్నా.. హృతిక్ లాంటి మాచో స్టార్ ముందు లుక్స్ పరంగా తన ఉనికిని చాటుకోవడం అంత తేలిక కాదు.

కానీ తారక్‌కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. అతను హృతిక్ కన్నా బెస్ట్ పెర్ఫామర్. నటనతో హృతిక్‌ మీద ఆధిపత్యం చలాయించగలడు. హిందీ డైలాగ్ డెలివరీ విషయంలోనూ ఆటోమేటిగ్గా మార్కులు కొట్టేస్తాడనడంలో సందేహం లేదు. ఇలా తన బలాల్ని సరిగ్గా ఉపయోగించుకుని హృతిక్‌కు దీటుగా నిలబడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.