అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఎలాంటి జాప్యం లేకుండా ఉంటే మొన్న ఏప్రిల్ 5 ది ఫ్యామిలీ స్టార్ స్థానంలో దేవర వచ్చేది. టిల్లు స్క్వేర్ తప్ప రెండో బలమైన ఆప్షన్ లేని టాలీవుడ్ బాక్సాఫీస్ ని వాడుకుని కలెక్షన్ల మోత మోగించే అవకాశం దక్కేది. దానికి తోడు ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, రెండు పెద్ద వీకెండ్లు ఇలా బంగారం లాంటి సీజన్ మిస్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడటంలో న్యాయముంది. సరే అయిందేదో అయ్యింది అక్టోబర్ 10 మంచి దసరా టైం కాబట్టి ఆ నెలంతా దున్నేయొచ్చనే అంచనాలు మెల్లగా పోటీ మేఘాల వల్ల ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తున్నాయి.
అదెలాగో చూద్దాం. విజయదశమి పండగను కేవలం టాలీవుడ్డే కాదు కోలీవుడ్ కూడా టార్గెట్ చేస్తోంది. సెప్టెంబర్ 27 పవన్ కళ్యాణ్ ఓజి వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనక ఎంతలేదన్నా మూడు వారాల బలమైన రన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ రజనీకాంత్ వెట్టాయన్ కనక ఫెస్టివల్ కావాలని కోరుకుంటే దేవరకు నేరుగా క్లాష్ తప్పదు. అదే జరిగితే తమిళనాడు, కేరళ మార్కెట్లలో తారక్ కి ఇబ్బందులు తప్పవు. అజిత్ విదయమయార్చిని సైతం అదే నెలలో దింపేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజులు ప్లాన్ చేసుకున్నావే.
నాగ చైతన్య తండేల్ గుట్టుచప్పుడు కాకుండా అక్టోబర్ టార్గెట్ గా పని చేసుకుంటోంది. ఒక రోజు గ్యాప్ ఇచ్చి అయినా సరే దేవరతో పోటీకి సిద్ధమనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్. ప్రచారంలో ఉన్నట్టు గేమ్ ఛేంజర్ కనక అక్టోబర్ 30 లాక్ చేసుకుంటే దీనికి దేవరకుకి కేవలం ఇరవై రోజుల గ్యాప్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ హీరోలు ఇంత తక్కువ నిడివిలో పోటీ పడటం బిజినెస్ కోణంలో సేఫ్ అనిపించుకోదు. విచిత్రంగా ఒక్క దేవర తప్ప వేరెవరూ క్లారిటీగా డేట్లు ప్రకటించకపోయినప్పటికీ ఇంత పోటీ వాతావరణం నెలకొనడం అనూహ్యం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates