హీరో నిఖిల్ ద‌ర్శ‌కుడ‌వుతున్నాడు

ఒక సినిమాకు సంబంధించినంత వ‌ర‌కు అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి ద‌ర్శ‌కుడు. ఎవ‌రి ఇమేజ్, ఫాలోయింగ్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడి త‌ర్వాతే ఎవ‌రైనా. అందుకు కెప్టెన్ ఆఫ్ ద షిప్‌కు ద‌క్కే గౌర‌వ‌మే వేరు. ఆ స్థానాన్ని అందుకోవ‌డానికి వేరే శాఖ‌ల వాళ్లు కూడా ప్ర‌య‌త్నిస్తుంటారు. వివిధ విభాగాల మీద కొంత ప‌ట్టు వ‌చ్చాక ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి రెడీ అవుతుంటారు. తెలుగు సినిమా విష‌యానికి వ‌స్తే ఈ జాబితాలో హీరోల సంఖ్య చాలా చాలా త‌క్కువ‌.

ఇప్పుడు టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ఆ అరుదైన జాబితాలో చేర‌బోతుండ‌టం విశేషం. కొన్ని రోజుల కింద‌టే నిఖిల్ ఇంట్లో సీరియ‌స్‌గా పేప‌ర్ మీద ఏదో రాసుకుంటున్న ఫొటోను ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు. త్వ‌ర‌లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చెప్ప‌నున్న‌ట్లు కూడా ఊరించాడు.

ఐతే ఆ విష‌యం.. నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతుండ‌ట‌మే అని వెల్ల‌డైంది. ఐతే పూర్తి స్థాయి ఫీచ‌ర్ ఫిలిం కాకుండా నిఖిల్ ప్రయోగాత్మ‌కంగా కొంద‌రు పిల్ల‌ల‌తో షార్ట్ ఫిలిం లాంటిదేదో చేస్తున్నాడ‌ని అంటున్నారు. ఈ విష‌య‌మై ఓ టీవీ కార్య‌క్ర‌మంలో కూడా నిఖిల్ సంకేతాలు అందించాడు.

త‌న సినిమాల క‌థా చ‌ర్చ‌ల్లో, మేకింగ్‌లో నిఖిల్ బాగా ఇన్వాల్వ్ అవుతాడ‌ని పేరుంది. అత‌డికంటూ ఓ అభిరుచి ఉంద‌ని ఎంచుకున్న సినిమాల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు ఆ అభిరుచితోనే ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు.

ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న నిఖిల్.. ఈ ఉత్సాహంలో ద‌ర్శ‌కుడిగా మార‌బోతుండ‌టం విశేష‌మే. మ‌రి అత‌ను ఎలాంటి సినిమా తీసి, ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్ర‌స్తుతం నిఖిల్ చేతిలో కార్తికేయ‌-2, 18 పేజెస్ సినిమాలున్నాయి.