కన్ఫ్యూజన్లో పెట్టేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నయా లుక్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఉన్నట్లుండి గుండు చేయించుకుని షాకింగ్ అవతారంలోకి మారిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరు ఇలా లుక్ ఎందుకు మార్చుకున్నాడన్నది అర్థం కావడం లేదు. గత నెలలో చిరు మీసం తీసి కనిపించాడు. అప్పటికి షూటింగ్ సంకేతాలేమీ లేని నేపథ్యంలో ఎవరికీ అది ఆశ్చర్యంగా అనిపించలేదు. కానీ ఈ నెలలో వరుసగా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని చిత్రాల షూటింగ్ మొదలైపోతోంది.

చిరు సినిమా ‘ఆచార్య’ షూటింగ్‌ను కూడా అతి త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఇలాంటి సమయంలో చిరు ఎందుకు జుట్టు తీయించుకున్నారో అర్థం కావడం లేదు. చిరు తమిళ హిట్ ‘వేదాలం’ రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఒరిజినల్లో అజిత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తక్కువ జుట్టుతో కనిపిస్తాడు. ఆ పాత్రను దృష్టిలో ఉంచుకుని చిరు ఇలా లుక్ మార్చుకున్నాడంటున్నారు.

ఐతే చిరంజీవికి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ‘ఆచార్య’. కరోనా వల్ల ఆ సినిమా ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని చూస్తున్న నేపథ్యంలో చిరు రంగంలోకి దిగి సాధ్యమైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాల్సిందే. ఐతే ఇప్పుడేమో ఆయన గుండు చేయించుకున్నారు. ‘ఆచార్య’ లుక్‌లోకి రావాలంటే చిరు రెండు నెలలైనా ఆగాలి. మరి అంతకాలం చిరు లేకుండా షూటింగ్ ఎలా చేస్తారన్నది అర్థం కాని విషయం.

ఐతే ‘ఆచార్య’లోనే పాత్ర అవసరం దృష్ట్యా చిరు ఈ లుక్‌లోకి మారాడా? ఆ సినిమాలోనే గుండుతో ఆశ్చర్యపరచబోతున్నాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనప్పటికీ చిరు పూర్తి స్పష్టతతోనే లుక్ మార్చుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. కానీ ఆయనకున్న క్లారిటీ ఏంటో.. ఆయన ఆలోచనేంటో తెలియకుండా మెగా అభిమానులు మాత్రం తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు.