ఇది ఎవరు ఏ సందర్భంలో చెప్పినా ముమ్మాటికీ నిజం. ఈ సంవత్సరమే కాదు దశాబ్దాల చరిత్ర ఇదే ఋజువు చేస్తోంది. నాలుగైదు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని, థియేటర్లు దొరక్క కలెక్షన్లు తగ్గుతాయని ఎవరెన్ని చెప్పినా ఈ పండగ ఇచ్చినంత రెవెన్యూ వేరే ఈ సీజన్ ఇవ్వదు కాబట్టే ఇంతగా పోటీ పడతారు. 2024 మనకు తెలిసిపోయిన స్టోరీ కాబట్టి ర్యాండంగా కొన్ని పాత ఉదాహరణలు చూద్దాం. 1988లో మంచి దొంగ – రక్త తిలకం – ఇన్స్ పెక్టర్ ప్రతాప్ – కలియుగ కర్ణుడు తలపడితే చిరు, బాలయ్య, వెంకీ ముగ్గురు అగ్ర హీరోలు మంచి విజయం అందుకున్నారు.
1992లో చంటి – కిల్లర్ – రక్త తర్పణం – ప్రాణదాత పోటీ పడితే వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ సాధించడం అప్పట్లో రికార్డు. 1994లో ముగ్గురు మొనగాళ్లు – అంగరక్షకుడు – నెంబర్ వన్ ఢీ కొంటే ఫామ్ తగ్గిన సూపర్ స్టార్ కృష్ణ ఘనవిజయం అందుకున్నారు. పది రోజుల తర్వాత వచ్చిన గోవిందా గోవిందా సైతం ఫ్లాప్ మూటగట్టుకుంది. 2000లో అన్నయ్య – కలిసుందాం రా – వంశోద్ధారకుడు – సమ్మక్క సారక్క – పోస్ట్ మ్యాన్ మధ్య కాంపిటీషన్ లో విక్టరీ ఎవరిని వరించిందో చెప్పనక్కర్లేదు. 2002లో టక్కరి దొంగ – సీమ సింహం – బ్రహ్మచారితో తలపడి నువ్వు లేక నేను లేను సంచలన విజయం నమోదు చేసింది.
2005లో నా అల్లుడు – బాలు – ధన 51తో ఫైట్ చేసి సిద్దార్ట్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్లాక్ బస్టర్ కావడం ఎవరూ మర్చిపోలేరు. 2016లో నాన్నకు ప్రేమతో – డిక్టేటర్లను తట్టుకుని ఎక్స్ ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్నినాయనా హిట్లు కొట్టడం చిన్న విషయం కాదు. ఆపై సంవత్సరం ఖైదీ నెంబర్ 150 – గౌతమిపుత్ర శాతకర్ణిలకు ఎదురెళ్ళిన శతమానం భవతి వాటి సరసన గర్వంగా నిలవడం చరిత్ర. ఇలా లెక్కలేనన్ని ఉదంతాలు వెనక్కు తవ్వేకొద్దీ దొరుకుతూనే ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సంక్రాంతి వార్ ఎప్పటికి ఆగిపోనీ ఆపలేని ఒక అంతులేని యుద్ధం.