ఇంద్రగంటి మోహనకృష్ణ అంటే చిన్న, మీడియం బడ్జెట్లలో సినిమాలు చేసుకునే దర్శకుడు. అతడి కాస్టింగ్ కూడా అలాగే ఉంటుంది. ఐతే ఇప్పుడాయన నుంచి రాబోతున్న వి.. తన గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తోంది. దాని బడ్జెట్, లుక్ అన్నీ ఒక రేంజ్‌లో కనిపిస్తున్నాయి. ఇంద్రగంటితో ఇంతకుముందు రెండు సినిమాలు చేసినప్పటితో పోలిస్తే నాని ఇమేజ్ కూడా మారింది. ఇంద్రగంటిని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమాలా కనిపించింది టీజర్, ట్రైలర్ చూస్తే. ఇంద్రగంటి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ శనివారం అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇంద్రగంటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే స్టైల్ పరంగా, స్కేల్ పరంగా ‘వి’ నాకొక ఛాలెంజింగ్ మూవీ. దీన్ని ఐదు రాష్ట్రాలతో పాటు థాయ్‌లాండ్‌లోనూ చిత్రీకరించాం. ఇంతకు ముందు నా సినిమాలను నేనింతలా లావిష్‌గా చేయలేదు. నేను తీసిన సినిమాల్లో నెక్స్ట్ రేంజ్ మూవీ అని చెప్పవచ్చు. ‘వి’ ఒక మిస్టరీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా. అందరినీ మెప్పించేలా ఉంటుంది’’ అని ఇంద్రగంటి అన్నాడు. వి సినిమా క్లైమాక్స్ చూస్తే అందరికీ సీక్వెల్ ఉంటుందనే అనుమానం వస్తుందని.. అయితే దాని సీక్వెల్ గురించి తాను ఇంకా ఆలోచించలేదని ఇంద్రగంటి చెప్పాడు.
ఇక ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయడం గురించి ఇంద్రగంటి స్పందిస్తూ.. ‘‘మా సినిమాను ఇప్పటికే ఐదు నెలలుగా హోల్డ్ చేశాం. కానీ ఇప్పటికీ థియేటర్లు తెరిచే విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు సినిమాను హోల్డ్ చేయొద్దని నిర్ణయించుకున్నాం. ఓ రకంగా థియేటర్ల కంటే ఓటీటీ వల్ల సినిమా 200 దేశాల్లో విడుదలవుతుండటం సంతోషమే. అందరికీ సినిమా చేరువ అవుతుంది. మొదటివారంలో సినిమా చూసేవాళ్లు మొదటి రోజునే సినిమా చూసే అవకాశం కలిగింది. ఒక టెక్నీషియన్‌గా నాకు సినిమాలను థియేటర్లలో చూడటమే ఇష్టం. ప్రేక్షకులు కూడా అంతే. థియేటర్ల అనుభవాన్ని ఎవరూ మిస్ చేసుకోవాలనుకోరు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమే’’ అని ఇంద్రగంటి అన్నాడు.