సుషాంత్ సింగ్ రాజ్‍పుట్ మరణంలో తన పాత్ర వుందని అనుమానాలు వ్యక్తమవుతోన్న సమయంలో సిబిఐ విచారణ జరిపించాలని రియా చక్రవర్తి డిమాండ్ చేసింది. అయితే ఆ సిబిఐకి తానే ప్రధాన టార్గెట్ అవుతానని ఊహించలేకపోయింది. సిబిఐ విచారణ అంటే ఎలాగుంటుందనేది రియాకు ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది.
నాలుగు రోజులుగా రోజుకి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఆమెను రకరకాల ప్రశ్నలు అడుగుతూ మొత్తం కూపీ లాగుతున్నారు. అసలు అన్ని గంటల పాటు ఏమి అడుగుతున్నారో, ఇంతవరకు ఆమెకి ప్రతికూలంగా కానీ, అనుకూలంగా కానీ ఏదైనా నిర్దారణకు వచ్చారో ఇంతవరకు తెలియదు. మీడియాకు లోపల వున్న సోర్సెస్ ద్వారా కాస్తో కూస్తో వివరాలు తెలుస్తున్నాయి కానీ అసలు ఈ కేసులో రియా నిందితురాలని నిర్దారించారో లేదో, ఆమెను అరెస్ట్ చేస్తారో లేదో మాత్రం ప్రస్తుతానికి సమాచారం లేదు.
రియాతో పాటు ఆమె సోదరుడిని, సుషాంత్ అనుచరులు, స్నేహితులు కొందరిని గట్టిగా విచారిస్తున్నారు. ఇంకా రియా తల్లిదండ్రులు, సుషాంత్ కుటుంబ సభ్యులను సిబిఐ పిలిపించలేదు. ఇదిలావుంటే రియా వద్ద కొన్ని ప్రశ్నలకు సవ్యమయిన సమాధానాలు లేవని, ముఖ్యంగా సుషాంత్‍కి అందించిన మెడికల్ ట్రీట్‍మెంట్, ఆమె ఫోన్‍లో దొరికిన ‘డ్రగ్స్ చాట్’ గురించి ఆమె స్పష్టమయిన సమాధానాలు ఇవ్వడం లేదని, ఈ కోణంలోనే ఆమెను ఎక్కువ సమయం విచారిస్తున్నారని సమాచారం.