వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జగన్ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రద్దు చేసిన హైకోర్టు… తాజాగా జగన్ సర్కారుకు మరో షాకిచ్చింది.
ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మైనింగ్ లీజులు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం జగన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ దురుదేశంతో లీజులు రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదన సరైనదేనన్న రీతిలో స్పందించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లాలో ఈ ఇద్దరు టీడీపీ నేతలకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. క్వారీయింగ్లో లోపాలు ఉన్నాయన్న కారణం చూపుతూ ఇద్దరు నేతల క్వారీల లీజులను రద్దు చేసింది.
ఇందులో ఎమ్మెల్యే గొట్టిపాటికి చెందిన ఐదు క్వారీలు, సన్నిహితులకు సంబంధించిన ఆరు క్వారీలు, పోతుల రామారావుకు సంబంధించిన ఒక క్వారీ ఉంది. అంతేకాదు గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో జరిమానాలు విధించగా.. ఇప్పుడు ఏకంగా లీజులే రద్దు చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
లీజులు రద్దుకు సంబంధించిన నోటీసులు రాగానే టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.