ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీస్ క్లాష్ విషయంలో ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ మూవీ ‘డుంకి’కి ఎప్పుడో క్రిస్మస్ డేట్ ఖాయం చేసుకున్నారు. కానీ ఈ మధ్యే ప్రభాస్ సినిమా ‘సలార్’ను కూడా క్రిస్మస్ రేసులోకి తీసుకొచ్చారు. సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడ్డ ఆ చిత్రం కోసం పలు డేట్లను పరిశీలించి చివరికి ‘డుంకి’ ఉందని తెలిసి కూడా క్రిస్మస్ సీజన్‌ను ఎంచుకున్నారు.
ఐతే షారుఖ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం అవుతోందని.. ‘సలార్’తో క్లాష్‌కు భయపడుతున్నారని.. అందుకే ఆ చిత్రాన్ని వాయిదా వేయబోతున్నారని కొన్ని రోజులు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిరాధారమని తర్వాత ‘డుంకి’ టీం నుంచి సంకేతాలు అందాయి. ఇప్పుడు ఆ విషయమే ఖరారు చేస్తూ.. ‘డుంకి’ని క్రిస్మస్ బరిలో దించుతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు.
డుంకిని ఇండియాలో డిసెంబరు 22న, విదేశాల్లో మాత్రం డిసెంబరు 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ విషయాన్నే ధ్రువీకరించారు. విదేశాల్లో ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగా రిలీజ్ చేయనున్న విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ఈ రోజు కన్ఫమ్ చేశారు. ఒక సైనికుడు ఒక మాటను నెరవేర్చేందుకు చేసిన ప్రయాణమే ఈ సినిమా అనే విషయాన్ని పోస్టర్ మీద రాశారు. సలార్ డిసెంబరు 22న రాబోతుండగా.. దానికి ఒక్క రోజు ముందే అంతర్జాతీయంగా ‘డుంకి’ సందడి చేయబోతోంది.
మొత్తానికి డుంకి క్రిస్మస్‌కే రాబోతోందన్న విషయంలో సందేహాలేమీ లేవు. దీన్ని బట్టి ‘సలార్’ను చూసి ‘డుంకి’ టీం భయపడటం లాంటిదేమీ జరగట్లేదని స్పష్టమైంది. ఇప్పటిదాకా తాను తీసిన ప్రతి సినిమాతోనూ బ్లాక్ బస్టర్ కొట్టిన రాజ్ కుమార్ హిరాని మీద నమ్మకంతోనే షారుఖ్ సాహసానికి సిద్ధపడి ఉండొచ్చు. రెండు భారీ చిత్రాలూ క్రిస్మస్‌నే టార్గెట్ చేయడంతో ఇక ఇండియాలో మరే భాషలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు క్రిస్మస్‌కు రానట్లే. ఈ రెండు చిత్రాల కోసం ఎక్కడికక్కడ భారీగా థియేటర్లను దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి క్రిస్మస్‌కు బాక్సాఫీస్‌లో అదిరిపోయే క్లాష్ చూడబోతున్నామన్నమాట.