కొన్ని డిజాస్టర్లు చేసే గాయాలు నిర్మాతలను మాములుగా దెబ్బ తీయవు. వాటి నుంచి కోలుకోవడానికి రోజులు కాదు ఒక్కోసారి నెలలు, సంవత్సరాలు కూడా పడతాయి. ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అయితే దీనికి కొందరి చేయూత, సహాయం అవసరమవుతాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత బ్యాడ్ ఫిలిం ఏదంటే అభిమానులు ఠక్కున చెప్పే పేరు అజ్ఞాతవాసి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ప్రజ్ఞాశాలి తనకెంతో ఇష్టమైన హీరోతో ఇలాంటి అవుట్ ఫుట్ ఎలా ఇచ్చాడనే అనుమానం టీవీలో, ఓటిటిలో చూసిన ప్రతిసారి ఫ్యాన్స్ కి వస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. అజ్ఞాతవాసి పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేసింది. జనవరిలో రిలీజై ఫలితం చూశాక ఎవరికీ ఏం జరిగిందో అంతు చిక్కని పరిస్థితి.
అలా ఒకరకమైన డిప్రెషన్ లో ఉండగా నాగవంశీకి ధైర్యాన్ని ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్. వెంటనే ఆ మూడ్ లో నుంచి బయటికి వచ్చేయమని, ఇదే సంవత్సరం మనం హిట్టు కొడుతున్నామని చెప్పి అరవింద సమేత వీర రాఘవకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లానింగ్ తో చక్కగా పూర్తి చేసి తారక్ మాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. దీంతో హారికా హాసినికి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.
ఇదంతా ఒక జాతీయ వెబ్ వీడియో మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ స్వయంగా పంచుకున్నారు. ఇలాంటి బోలెడు సంఘటనలు ఉంటాయని, అన్నీ బయటికి చెప్పుకోలేమని చెబుతూనే అజ్ఞాతవాసి ఒకటే ఉదహరించారు. నిజంగానే ఆ టైంలో మాటల మాంత్రికుడికి అరవింద సమేత పెద్ద ఆక్సిజన్ లా పని చేసింది. ఎలాంటి లౌడ్ హీరోయిజం లేకుండా చాలా సెటిల్డ్ గా ఫ్యాక్షన్ కథలో తారక్ ని చూపించిన తీరు దాన్నో స్పెషల్ మూవీగా నిలిపింది. అక్కడి నుంచి అంత పెద్ద దెబ్బ ఆ బ్యానర్ కు ఎప్పుడూ పడలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates