జ‌వాన్.. విదేశాల్లో మాత్ర‌మే 350 కోట్లు

ఈ ఏడాది ఇండియ‌న్ బాక్సాఫీస్ షారుఖ్ ఖాన్‌దే అని చెప్పాలి. ఒక్క ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వ‌డ‌మంటే సామాన్య‌మైన విష‌యం కాదు. అన్నీ క‌లిసొస్తే డుంకి మూవీతో ఒకే ఏడాది మూడోసారి వెయ్యి కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చ‌ర్యం లేదేమో. ఈ ఏడాది ఆరంభంలో ప‌ఠాన్‌తో షారుఖ్ ఎలా బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడో తెలిసిందే.

దాంతో పోలిస్తే జ‌వాన్‌కు అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. అయినా స‌రే.. షారుఖ్ మ‌రోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించాడు. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా త‌ర్వాత కూడా నిల‌క‌డ‌గా వ‌సూళ్లు రాబ‌ట్టింది. చూస్తుండ‌గానే వెయ్యి కోట్ల మార్కును కూడా దాటేసింది. ఇందులో కేవ‌లం విదేశీ వ‌సూళ్లు మాత్ర‌మే రూ.360 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం.

ఓ బాలీవుడ్ మూవీ ఓవ‌రాల్ వ‌సూళ్లు రూ.360 కోట్లు వ‌చ్చినా ఆహా ఓహో అని చెప్పుకునే రోజులు ఇవి. క‌రోనా త‌ర్వాత హిందీ చిత్రాల వ‌సూళ్లు అంత‌లా ప‌డిపోయాయి. కానీ రీఎంట్రీలో షారుఖ్ సినిమాలు మాత్రం బంప‌ర్ వ‌సూళ్ల‌తో దూసుకెళ్తున్నాయి. ఒక్క అమెరికాలో మాత్ర‌మే జ‌వాన్ 15 మిలియ‌న్ డాల‌ర్ల దాకా వ‌సూళ్లు రాబ‌ట్టింది. గ‌ల్ఫ్ కంట్రీస్ స‌హా ప‌లు దేశాల్లో జ‌వాన్ ప్ర‌భంజ‌నం సృష్టించింది.

ఫుల్ ర‌న్లో ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చ‌ర్యం లేదు. నాలుగో వారంలో కూడా ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. కొత్త సినిమా వ్యాక్సిన్ వార్ దాని ముందు వెల‌వెల‌బోతోంది. ఫ‌క్రీ-3 మాత్ర‌మే జ‌వాన్‌కు పోటీ ఇస్తోంది. ఇక ఇండియా వ‌ర‌కు ఆల్రెడీ ఆల్ టైం హైయెస్ట్ నెట్ వ‌సూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు నెల‌కొల్పిన జ‌వాన్.. ఫుల్ రన్లో ఇండియాలో హిందీ వ‌ర‌కే రూ.600 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. మొత్తంగా ఈ సినిమా రూ.1200 కోట్ల మార్కును అందుకునే అవకాశాలున్నాయి.