చిరు సినిమా కోసం మెహ‌ర్ ర‌మేష్ మూడేళ్లుగా..

కొన్ని రోజుల కింద‌ట మెగాస్టార్ చిరంజీవి త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. వాటి ద‌ర్శ‌కుల పేర్లు చెప్పిన‌పుడు ఒక పేరు విని అంద‌రూ షాకైపోయారు. ఆ పేరు.. మెహ‌ర్ ర‌మేష్‌. కంత్రి, శ‌క్తి, షాడో లాంటి డిజాస్ట‌ర్లు తీసిన ద‌ర్శ‌కుత‌ను. షాడో త‌ర్వాత ఏడెనిమిదేళ్లుగా అత‌ను ఖాళీగా ఉన్నాడు. మ‌రో సినిమా తీయ‌లేదు. ఇక మ‌ళ్లీ అత‌ణ్ని న‌మ్మి ఏ స్టార్ హీరో కూడా అవ‌కాశం ఇవ్వ‌డ‌ని అంతా అనుకుంటుంటే.. చిరంజీవి త‌న‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించ‌డం పెద్ద షాకే. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో త‌మిళ హిట్‌ వేదాళంకు రీమేక్ రాబోతోంద‌ని అంటున్నారు. ఐతే ఈ ప్రాజెక్టు అధికారికంగా ఇంకా ఖ‌రార‌వ్వ‌లేదు.

ఐతే ఓ ఇంట‌ర్వ్యూలో మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కున్న అభిమానం ఎలాంటిదో వివ‌రించిన ర‌మేష్‌.. ద‌ర్శ‌కుడిగా త‌న తొలి చిత్రం వీర క‌న్న‌డిగ (క‌న్న‌డ ఆంధ్రావాలా) ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న‌ది చిరు పుట్టిన రోజైన ఆగ‌స్టు 22నే అని వెల్ల‌డించాడు. ఇక ద‌ర్శ‌కుడిగా తాను సినిమా తీసి చాలా ఏళ్ల‌యిన‌ప్ప‌టికీ.. తానేమీ ఖాళీగా లేనని.. ఎన్నో సినిమాల‌కు స్క్రిప్టు డిస్క‌ష‌న్ల‌లో పాల్గొన్నాన‌ని అత‌ను వివ‌రించాడు. చిరంజీవితో సినిమా అన్న‌ది అంద‌రు ద‌ర్శ‌కుల్లాగే త‌న‌కూ ఓ క‌ల అని.. అది నెర‌వేరుతుంద‌ని ఊహించ‌లేద‌ని మెహ‌ర్ తెలిపాడు. చిరంజీవితో సినిమా కోసం మూడేళ్ల కింద‌టే ప‌ని మొద‌లుపెట్టాన‌ని.. అది ఎట్ట‌కేల‌కు ఓ కొలిక్కి వ‌చ్చి ఆయ‌న సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడ‌ని మెహ‌ర్ తెలిపాడు. అంత‌కుమించి ఈ సినిమా విశేషాలేమీ మెహ‌ర్ పంచుకోలేదు.