కరోనాతో కీరవాణి ఆ స్థితికి వెళ్లారా?

MM Keeravani

రాజమౌళి, కీరవాణి కుటుంబాల సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. సామాజిక అంశాలపై వాళ్లు చురుగ్గా స్పందిస్తుంటారు. జనాలకు ఏదైనా విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నపుడు ముందుకొస్తుంటారు. ఈ మధ్య వారి కుటుంబంలో చాలామంది కరోనా బారిన పడ్డారు. రాజమౌళి, కీరవాణి కూడా కరోనా బాధితులే.

వీరి కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, పనివాళ్లలో కలిపి రెండంకెల సంఖ్యలోనే కరోనా బారిన పడ్డారట. వాళ్లందరిలోకి ఎక్కువగా ఇబ్బంది పడ్డది పెద్ద వయస్కుడైన కీరవాణేనట. ఈ విషయాన్ని ప్లాస్మా దానంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాజమౌళితో కలిసి పాల్గొన్న కీరవాణి వెల్లడించారు.

మిగతా వాళ్లందరూ ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుని కోలుకోగా.. తాను ఒక్కడిని మాత్రం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడిందని కీరవాణి తెలిపారు. ఒక దశలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్లాస్మా ఎక్కించాల్సిన అవసరం వచ్చిందని డాక్టర్లు చెప్పారని.. ఐతే ఒక రోజు ఆగి చూద్దాం అని ఆగారని.. ఐతే తర్వాతి రోజుకు తన పరిస్థితి మెరుగుపడిందని.. తన కోసం అనుకున్న ప్లాస్మా ఇంకో ఇద్దరు ప్రాణాలు కాపాడ్డానికి ఉపయోగపడిందని కీరవాణి వెల్లడించారు.

దేవుడైన శ్రీరామ చంద్రుడికే ఒకప్పుడు ప్రాణాపాయం తలెత్తితే సంజీవని అవసరం పడిందని.. ఇప్పుడు కరోనా బాధుతలందరికీ సంజీవని ప్లాస్మానే అని.. అది ఇచ్చేవాళ్లందరూ ప్రాణ దాతలేనని.. అందుకే తమలో యాంటీబాడీస్ ఏర్పడిన వాళ్లందరం ప్లాస్మా దానం చేస్తున్నామని.. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న సీపీ సజ్జనార్ అభినందనీయుడని అన్నారు కీరవాణి.