తీసింది తక్కువ సినిమాలే కానీ.. సంపత్ నంది అనే పేరు టాలీవుడ్లో బాగానే పాపులర్. ‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. ఆ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘రచ్చ’ సినిమా తీసి.. దాన్ని సక్సెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సంపత్.
వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ చేసే అవకాశం అందుకోవడం మరో సంచలనం. కానీ రేండేళ్లు ఆ స్క్రిప్టు కోసం కష్టపడి చివరికి ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేయడంతో వార్తల్లో నిలిచాడు. ఆ చేదు అనుభవం నుంచి బయటపడి బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాలు తీశాడు సంపత్. కానీ అవి ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
దర్శకుడిగా ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తూనే నిర్మాతగా మారి.. బయటి వాళ్లకు అవకాశం ఇచ్చాడు సంపత్. అలా రెండు సినిమాలు తీశాడతను. ఆ రెంటికీ కథలు అందించింది సంపతే. అందులో ఒకటి గాలిపటం కాగా.. మరొకటి పేపర్ బాయ్. ఈ రెంటికీ మంచి బజ్ వచ్చింది. కానీ అవి రెండూ ఆడలేదు. ‘పేపర్ బాయ్’ సినిమా నచ్చి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం సంపత్ తన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా వల్ల దాని షూటింగ్‌కు బ్రేక్ పడింది. లాక్ డౌన్‌లో దొరికిన ఖాళీలో ఓ థ్రిల్లర్ కథ రెడీ చేసిన సంపత్.. ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధామోహన్ బేనర్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. సంపత్ శిష్యుడు అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు సంపత్. ఇంకా నటీనటులెవ్వరెన్నవి వెల్లడి కాలేదు. సోమవారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిపారు. మరి సంపత్ కథ ఈసారైనా విజయాన్నందిస్తుందేమో చూడాలి.