ఎన్ని సినిమాలు తీసినా ఇప్పటి ఆడియెన్స్ కి ది కాశ్మీర్ ఫైల్స్ తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. గత ఏడాది రాధే శ్యామ్ రిలీజైన రోజే తన సినిమాని వదిలి బ్లాక్ బస్టర్ అందుకోవడం అంత ఈజీగా మర్చిపోయేది కాదు. అయితే ఈసారి కూడా సలార్ ని టార్గెట్ చేసుకుని ది వ్యాక్సిన్ వార్ ని విడుదల చేయబోతున్న సంగతీ తెలిసిందే. అయితే ప్రభాస్ కంటే తానే గొప్పవాడినని ఋజువు చేయడం కోసం కావాలనే క్లాష్ అవుతున్నాడని, ఆ మాట వివేకే అన్నట్టు నిన్నంతా సోషల్ మీడియాలో గట్టి ప్రచారమే జరిగింది. దీని గురించి ఆయనే ఓపెనయ్యాడు.
ప్రభాస్ ఒక పెద్ద మెగాస్టార్ అని, చిన్న బడ్జెట్ చిన్న స్టార్లతో సినిమాలు తీసే తాను పోలిక ఎందుకు పెట్టుకుంటానని, అలాంటి దిగజారుడు స్టేట్ మెంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టాడు. అయితే సలార్ లాంటి డైనోసర్ మూవీతో ఎందుకు తలపడుతున్నారంటే మాత్రం అది కేవలం కాకతాళీయంగా జరిగిందే తప్ప కావాలని ప్లాన్ చేసింది కాదని అన్నారు. ఇటీవలే తెరమీద దేవుళ్ళుగా కనిపించేవాళ్ళు రాత్రి మందు కొడతారని వివాదాస్పద కామెంట్లు చేసిన వివేక్ అగ్నిహోత్రి అవి ఎవరిని ఉద్దేశించి అన్నారో క్లారిటీ ఇవ్వకపోయినా మాటలు మాత్రం వైరలయ్యాయి.
ఏదో ఒక రూపంలో వివేక్ అగ్నిహోత్రి వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా సమయంలో భారతదేశం పోరాడిన తీరు, వ్యాక్సిన్ కనుక్కోవడంతో మన డాక్టర్లు చేసిన కృషి, ప్రభుత్వం తీసుకున్న చర్యల చుట్టూ వివేక్ ది వ్యాక్సిన్ వార్ ని రూపొందించారు. బయటికి పూర్తి వివరాలు ఇవ్వలేదు కానీ ఇందులో కూడా కాంట్రావర్సీ అంశాలు ఉంటాయని యూనిట్ నుంచి వస్తున్న టాక్. అయినా ప్రభాస్ మీద ద్వేషం ఉన్నా లేకపోయినా దాని వల్ల డార్లింగ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. పైపెచ్చు ఆ పేరుని వాడుకోవడం వల్ల వివేక్ లాంటి వాళ్ళకే ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని వేరే చెప్పాలా