రాకీ రాణి ప్రేమలో తెలుగు సినిమాల మిక్సీ

కరోనా తర్వాత భారీ బ్లాక్ బస్టర్లు లేక నెలకి ఒక పెద్ద హిట్టు రావడమే గగనంగా మారిన బాలీవుడ్ ఆశలన్నీ ఈ నెల 28న విడుదల కాబోతున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని మీదే ఉన్నాయి. తన 25వ సంవత్సర సందర్భంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని రూపొందించాడు. రణ్వీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీలో పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఒకప్పుడు కభీ ఖుషి కభీ గమ్, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చిన కరణ్ మళ్ళీ ఆ స్థాయి మేజిక్ చేయలేకపోయాడు. అందుకే దీని మీద ఇంత హైప్ వచ్చింది.

తీరా చూస్తే ఇది మన బొమ్మరిల్లుని భూతద్దంలో పెట్టి తీసినట్టే ఉంది. కథ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. రాకీ, రాణిల తొలి కలయిక గొడవలతో మొదలవుతుంది. తర్వాత ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ఇద్దరి కుటుంబాలు చాలా విచిత్రమైనవి. పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళను ఒప్పించడం తప్పనిసరని నిర్ణయించుకుని కొద్దిరోజుల పాటు అవతలి వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలని ఫిక్స్ అవుతారు. అలా చేరాక ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. విడిపోయే దాకా వెళ్తారు. కానీ ఆ తర్వాత జరిగే డ్రామా ఇద్దరినీ ఒకటి చేయడం సులభంగా ఊహించుకునేదే.

చాలా గ్రాండియర్ గా కనిపిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానిని బోలెడు తెలుగు సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. హ్యాపీ, బొమ్మరిల్లు, కలిసుందాం రా, సంతోషం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటేమిటి అన్నీ మిక్స్ అయ్యాయి. జయభాదురి, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ చాంతాడంత ఉంది. రణ్వీర్, అలియాల పెర్ఫార్మన్స్ అక్కడక్కడా కొంచెం ఓవరనిపించినా ఫైనల్ గా బాగానే కుదిరారు. సోషల్ మీడియాలో చెప్పినట్టు షారుఖ్-కాజల్ తరహా కెమిస్ట్రీని మాత్రం పండించలేకపోయారు. నార్త్ లో ఏమో కానీ ఇలా చూసేసిన కథను మనవాళ్ళు ఎంత మాత్రం ఆదరిస్తారో చూడాలి