సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి రెండు నెలలు దాటిగా అతడి గురించి చర్చ ఆగట్లేదు. ఓవైపు అతడిది ఆత్మహత్యా కాదా అనే విషయంలో విచారణ సాగుతోంది. ముందు ముంబయి పోలీసులు విచారణ చేపట్టగా.. తర్వాత సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్ నుంచి పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడు అతడి మృతి కేసును సీబీఐ టేకప్ చేసి విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే సుశాంత్ బతికుండగా అతడి గురించి పెద్దగా తెలియని విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సుశాంత్‌కు స్పేస్ సైన్స్ పట్ల ఉన్న ఆసక్తి, అతను అంతరిక్షంలో స్థలం కొనడం, అంతరిక్ష పరిశోధనల పట్ల అమితాసక్తిని ప్రదర్శించడం, ఆ నేపథ్యంలో ఓ సినిమా కూడా చేయాలనుకోవడం లాంటి విషయాలు బయటికి వచ్చాయి.
అలాగే సినిమా నటుడిగా తన పరిధిని విస్తరించుకునే దిశగా కూడా సుశాంత్‌కు అనేక కలలు ఉన్న సంగతి వెల్లడవుతోంది. తన లక్ష్యాల గురించి అతను డైరీలో రాసుకున్న విషయాలు కొన్ని బయటికి వచ్చాయి. సుశాంత్ చేతి రాతతో ఉన్న డైరీ పేజీలు ఆసక్తి రేపుతున్నాయి. 2020లో తాను హాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లు అతను అందులో సంకేతాలు ఇచ్చాడు. అలాగే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టి.. మంచి రైటింగ్ టీంను ఏర్పాటు చేసుకోవడం, అనుభవజ్ఞులతో పాటు కొత్త తరహా ఆలోచనలున్న వారితో కలిసి పని చేయడం.. స్టార్టప్ ఏర్పాటు చేయడం గురించి కూడా అందులో అతను ప్రణాళికలు వేసుకున్నాడు. ఇంకా సినిమాతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవడం లాంటి అంశాల గురించి అతను డైరీలో రాసుకున్నాడు. ఇంతగా 2020ని ప్లాన్ చేసుకున్నవాడు.. ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం విషాదమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates