గత ఆరు నెలల్లో ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల గురించి జరిగినంత చర్చ తెలుగులో మరే చిత్రం గురించీ జరగలేదు. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. దీన్ని చిత్ర బృందం కూడా పలుమార్లు ఖండించింది. అయినా సరే.. ఆ ప్రచారం ఆగలేదు.
ఐతే ఓటీటీ రిలీజ్ అంటే మొదట్లో కస్సుమన్న కోన వెంకట్.. ఆ తర్వాత కొంచెం స్వరం మార్చాడు. థియేటర్లు తెరుచుకోవడంలో మరీ ఆలస్యం జరిగితే ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచిస్తామన్నాడు. ఇప్పుడు చిత్ర బృందం నిజంగానే ఆ దిశగా ఆలోచిస్తున్నట్లుంది.
కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు. జనవరి, ఫిబ్రవరి నెలలకు కానీ థియేటర్లు తెరుచుకునేలా లేవని.. ఈ నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ సినిమాను ఎక్కడ చూడాలనుకుంటున్నారు అంటూ థియేటర్లు, ఓటీటీ, ఎక్కడైనా ఓకే అనే ఆప్షన్లు ఇచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయానికి 18 వేల మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. అందులో 56 శాతం మంది ఓటీటీ ఆప్షన్ ఎంచుకోవడం విశేషం. థియేటర్లలోనే చూస్తామని 29 శాతం మంది అన్నారు. మిగతా 15 శాతం మంది ఎక్కడైనా ఓకే అన్నారు.
థియేటర్లలో చూడాలనుకుంటున్న వారితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ఓటీటీకి ఓకే అన్నారు. ప్రేక్షకుల ఉద్దేశం ఇలా ఉన్నపుడు చిత్ర బృందం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదేమో. ఆల్రెడీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యే కోన ఇలా పోల్ పెట్టి ఉంటాడని.. కాబట్టి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో నేరుగా రిలీజవుతుందని భావిస్తున్నారు.