తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లక్షకుపైగా గుమిగూడిన అభిమాన సందోహం మధ్య ఆదిపురుష్ కొత్త ట్రైలర్ ని విడుదల చేశారు. పూర్తిగా యాక్షన్ విజువల్స్ తో నిండిన ఈ వీడియో చూశాక ఇంకా ఎవరికైనా కాసిన్ని అనుమానాలు ఉన్నా పూర్తిగా తీరిపోతాయి. గ్రాఫిక్స్ విషయంలో మెల్లగా భ్రమలను తొలగిస్తూ వెళ్లిన టి సిరీస్, దర్శకుడు ఓం రౌత్ ఇప్పుడు అంచనాలను ఒక్కసారిగా పీక్స్ కు తీసుకెళ్లారు. త్రీడిలోనే ఎందుకు చూడాలన్న కామెంట్ కు సరైన సమాధానం మరోసారి ఈ ఫైనల్ వెర్షన్ ట్రైలర్ కట్ ద్వారా దొరికేసిందనే చెప్పాలి.
సీత(కృతి సనన్)ని అపహరించడానికి రావణుడు(సైఫ్ అలీఖాన్) యాచకుడి వేషంలో వచ్చి ఆమెను ఎత్తుకుపోవడంతో మొదలుపెట్టి నా రఘురాముడు వస్తే తప్ప నేను అశోకవనం నుంచి రానని హనుమంతుడికి సీత చెప్పడం వరకు మొత్తం యుద్ధ సన్నివేశాలతో కనుల విందుగా ఉంది. ప్రమాదకర పక్షులు, అనకొండను తలపించే విష సర్పాలు, లంక దహనంలో ఎదురైన కొట్లాటలు, రామ రావణ సమరంలో జరిగిన రోమాంచక సంఘటనలు అన్నీ మాములుగా లేవు. అభిమానులకే కాదు మాములు ప్రేక్షకులు సైతం థియేటర్ కు వెళ్ళాలనేంత నీట్ గా కట్ చేశారు
పదే రోజుల్లో రాబోతున్న ఆదిపురుష్ హైప్ కు సరిపడా మొత్తం వీడియోలు వచ్చేశాయి. మూడు గంటల నిడివి ఇలాంటి కంటెంట్ తో బోర్ కొట్టించే సమస్య ఉండదు. గ్రాఫిక్స్ వాడిన తీరు చిన్నపిల్లలతో చప్పట్లు, మాస్ తో విజిల్స్ వేయించడం ఖాయమనేలా ఉంది. యుద్ధం గురించిన ఆవశ్యకతకు చెప్పిస్తూ భవిష్యత్ తరాలకు పాఠాలు నేర్పించేలా రాముడితో పలికించిన మాటలు ఆకట్టుకునేలా సాగాయి. చూస్తుంటే అందరూ ఊహించిన దానికన్నా భారీ ఓపెనింగ్స్ ఆదిపురుష్ రాబట్టుకోవడం ఖాయమే అనిపిస్తోంది. వెయ్యి కోట్ల లక్ష్యం పెద్ద విషయమే కాదు