అవతార్-2.. ఎట్టకేలకు

పోస్టర్ మీద జేమ్స్ కామెరూన్ పేరు కనిపిస్తే చాలు.. దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతున్నారు. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా ‘టైటానిక్’ సినిమా దగ్గర్నుంచి ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు.

‘టైటానిక్’ అప్పట్లో అన్ని రికార్డులనూ తుడిచిపెట్టేయగా.. ఆ తర్వాత పదేళ్లకు వచ్చిన ‘అవతార్’ అంతకుమించిన రికార్డులను నెలకొల్పింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘అవతార్-2’ మీద ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. గత ఏడాది డిసెంబరు 17న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. వసూళ్ల మోత మోగించింది.

అసాధ్యం అనుకున్న 2 వేల బిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసి.. మరింతగా కలెక్షన్లు రాబట్టింది. ఐతే ఇలాంటి సినిమాను బిగ్ స్క్రీన్ మీద, త్రీడీలో చూస్తేనే మజా. కానీ ఆ అవకాశం కోల్పోయిన వాళ్లు, డివైడ్ టాక్ వల్ల వెనుకంజ వేసిన వారు.. బుల్లితెరపై సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఐతే వాళ్లు చాలా రోజులే నిరీక్షించాల్సి వచ్చింది. థియేటర్లలో విడుదలయ్యాక దాదాపు ఆర నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని ఫ్లాట్ ఫ్లామ్స్‌లో పెయిడ్ స్ట్రీమింగ్ ఇచ్చారు కానీ.. హాట్ స్టార్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఫ్రీగా సినిమా చూసే అవకాశం త్వరలోనే రానుంది.

జూన్ 7న హాట్ స్టార్‌లో తెలుగు సహా పలు భాషల్లో ‘అవతార్-2’ డిజిటల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. హెచ్డీ సహా పలు వెర్షన్లలో సినిమాను స్ట్రీమ్ చేయబోతోంది హాట్ స్టార్. పెద్ద స్క్రీన్, హై ఎండ్ టెక్నాలజీ ఉన్న టీవీల్లో అయితే ‘అవతార్-2’ చూస్తే బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్‌కు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని చెప్పొచ్చు.