బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి తెలుగులో భారీ భారీ సినిమాలే చేశాడు. వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో ‘అల్లుడు శీను’ అనే పెద్ద బడ్జెట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను లాంటి మరో స్టార్ డైరెక్టర్‌తో ‘జయ జానకి నాయక’ చేశాడు. శ్రీవాస్‌తో చేసిన ‘సాక్ష్యం’ సైతం పెద్ద బడ్జెట్ మూవీనే. ఈ సినిమాల వెనుక ఉండి శ్రీనివాస్‌ను నడిపించింది తండ్రి బెల్లంకొండ సురేషే.
తెలుగులో శ్రీనివాస్ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడా అంటే ఔనని అనలేం.. అలా అని అతణ్ని తీసిపడేయలేం. మాస్‌ను అతను ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. కొంత ఫాలోయింగ్ సంపాదించాడు. ఐతే ఆశ్చర్యకరంగా శ్రీనివాస్ తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి అనూహ్యమైన ఆదరణ దక్కించుకున్నాయి. అతడి సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి యూట్యూబ్‌లో. ఈ పాపులారిటీతోనే శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా వినాయకే దర్శకుడు.
ఈ సినిమా ఈ శుక్రవారమే హిందీలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సురేష్ తన పుత్రోత్సాహాన్ని చాటాడు మీడియా ముందు. “ఒక టాలీవుడ్ హీరోతో జయంతి లాల్ గాడా లాంటి టాప్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ 60 కోట్లు పెట్టి సినిమా తీయడం.. మా వాడిని హీరోగా ప్రమోట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. శ్రీనివాస్ సినిమాలు యూట్యూబ్‌లో 500 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకున్నాయి. ఒక సినిమాకు 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ఆదరణ చూసే గాడా గారు మా అబ్బాయిని హిందీలో హీరోగా పరిచయం చేయడానికి ముందుకు వచ్చారు. పెద్ద బడ్జెట్లో సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోట్ చేయడానికి మా అబ్బాయి పాట్నా, లక్నో లాంటి సిటీలకు వెళ్తుంటే జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఒక తెలుగు స్టార్ హీరోకు నార్త్ ఇండియాలో ఇలాంటి ఆదరణ దక్కడం గొప్ప విషయం. ఒక తండ్రిగా నేను ఇందుకు గర్వపడుతున్నా” అని సురేష్ తెలిపాడు.